Amaravati: ఏపీ మున్సిపల్ ఎన్నికలు..ఏకగ్రీవ చైర్ పర్సన్ స్థానాల్లో కూటమి హవా!

Amaravati: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల హవా కొనసాగుతోంది. ఏకగ్రీవ చైర్ పర్సన్ ఎన్నికల్లో 15 స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా, జనసేన, బీజేపీ చెరో స్థానం దక్కించుకున్నాయి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 31 Oct 2026 10:47 AM IST
Amaravati
X

Amaravati: ఏపీ మున్సిపల్ ఎన్నికలు..ఏకగ్రీవ చైర్ పర్సన్ స్థానాల్లో కూటమి హవా!

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మున్సిపల్ చైర్ పర్సన్ పదవుల ఎన్నికల్లో కూటమి పార్టీల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 87 మున్సిపాలిటీలకు సంబంధించి వెలువడిన ఏకగ్రీవ చైర్ పర్సన్ల జాబితాలో 17 స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఇందులో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. మొత్తం 17 స్థానాల్లో 15 స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లగా.. జనసేన, బీజేపీ చెరో స్థానాన్ని దక్కించుకున్నాయి.

కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ మున్సిపల్ పీఠాలపై తన పట్టును చాటుకుంది. జనసేనకు దర్శి మున్సిపల్ చైర్ పర్సన్ స్థానం దక్కగా.. బీజేపీకి ఎర్రగుంట్ల మున్సిపల్ పీఠం దక్కింది. దర్శిలో దారం సుబ్బారావు జనసేన తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎర్రగుంట్లలో గోర్ల మధు లత బీజేపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జిల్లాల వారీగా పరిశీలిస్తే వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా ఆరు మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజంపేటలో దొంతం గాయత్రి, ప్రొద్దుటూరులో నంద్యాల రాఘవరెడ్డి, బద్వేల్‌లో దివ్య తేజ సోమేశుల, మైదుకూరులో ధనపాల జగన్, కమలాపురంలో స్వప్న గొంగలరెడ్డి టీడీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎర్రగుంట్లలో బీజేపీకి చెందిన గోర్ల మధు లత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పల్నాడు జిల్లాలో మూడు మున్సిపల్ పీఠాలు ఏకగ్రీవం అయ్యాయి. పిడుగురాళ్లలో షేక్ బాబావలి, గురజాలలో నెలవెల్లి బొల్లయ్య, దాచేపల్లిలో తంగెళ్ల శ్రీనివాసరావు టీడీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మార్కాపురం ప్రాంతం పరిధిలోని దర్శిలో జనసేన అభ్యర్థి దారం సుబ్బారావు, కనిగిరిలో టీడీపీ అభ్యర్థి తిరుపతమ్మ అచ్చల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అన్నమయ్య జిల్లాలో పుంగనూరులో నయీమ్ తాజ్, రాయచోటిలో షేక్ ఖాదర్ వలీ టీడీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు–తిరుపతి ప్రాంతంలో నగరి మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఈ.ఎన్. శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లాలో గూటీ మున్సిపల్ చైర్ పర్సన్‌గా జి.ఆర్. తమిళ సెల్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డలో షేక్ అనీషా, ఆత్మకూరులో ఆవుల గోవింద రాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఏకగ్రీవ మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కూటమిలోని మిత్రపక్షాల మధ్య పదవుల పంపకాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు ఈ ఫలితాల్లో ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కడప, పల్నాడు జిల్లాల్లో ఏకగ్రీవ స్థానాలు ఎక్కువగా ఉండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మిగిలిన మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత పట్టణ స్థానిక సంస్థల్లో ఏ పార్టీకి ఎంతమేర ప్రాతినిధ్యం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.