Tadepalli: బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో మంత్రి సవిత సమీక్ష - ఆదేశాలు!
Tadepalli: భారీ వర్షాల నేపథ్యంలో బీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సవిత ఆదేశం. కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులతో సమీక్ష సమావేశం.
Tadepalli: బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో మంత్రి సవిత సమీక్ష - ఆదేశాలు!
Tadepalli: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో మంత్రి సవిత సమావేశమయ్యారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణతో పాటు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, పేరేపి ఈశ్వర్, మల్లెల ఈశ్వర్, వెంకటరమణ, యాటగిరి రాంప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సవిత సమీక్షించారు. ఆయా పథకాల అమలు తీరు, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, గురుకులాల విషయంలో అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సవిత ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. హాస్టళ్లు, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు.
విద్యార్థులకు తాజా, వేడి ఆహారాన్ని మాత్రమే అందించాలని మంత్రి ఆదేశించారు. బయట నుంచి ఆహారాన్ని హాస్టళ్లు, గురుకులాల్లోకి తీసుకురాకుండా పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఎవరికైనా అస్వస్థత తలెత్తితే వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వ్యాధులు వ్యాపించిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాలని సూచించారు.
పాత భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థుల భద్రతను పరిశీలించాలని మంత్రి సవిత చెప్పారు. భారీ వర్షాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న భవనాల్లోని విద్యార్థులను ముందుగానే సురక్షిత భవనాలకు తరలించాలని ఆదేశించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా జిల్లా స్థాయి అధికారులు, హాస్టల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇక బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న ప్రభుత్వ పథకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సవిత కార్పొరేషన్ చైర్మన్లకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాల సమాచారం చేరేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలు బీసీ వర్గాలకు అందేలా అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని కార్పొరేషన్ చైర్మన్లకు మంత్రి సవిత సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.




