Amaravati: బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం?

Amaravati: ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆర్టీసీ కండక్టర్‌పై మహిళ ఫిర్యాదు. స్పందించి విచారణకు ఆదేశించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 6 Oct 2026 11:14 AM IST
Amaravati
X

Amaravati: బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం?

Amaravati: బస్సులో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, చివరకు మోసానికి దారితీసిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది. తనను ప్రేమిస్తున్నానని నమ్మించి ఆర్టీసీ కండక్టర్ తన నుంచి దశలవారీగా నగదు, బంగారం తీసుకున్నారని చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెకు చెందిన ఎం. బేబీ శాలిని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆశ్రయించారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తాను చంద్రగిరి నుంచి తిరుపతికి ప్రతిరోజూ బస్సులో ప్రయాణించే సమయంలో ఆర్టీసీ కండక్టర్ వి. సుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పడిందన్నారు. ఆ పరిచయాన్ని క్రమంగా పెంచుకున్న సుబ్రహ్మణ్యం తనను ప్రేమిస్తున్నానని నమ్మించారని తెలిపారు. అనంతరం ప్రేమ పేరుతో తన వద్ద నుంచి వివిధ దశల్లో సుమారు రూ.20 లక్షల వరకు నగదు తీసుకున్నారని ఆరోపించారు.

ఫోన్‌పే ద్వారా పలుమార్లు డబ్బులు బదిలీ చేయించుకున్నారని, తనతో బంగారం కూడా కొనిపించుకున్నారని బాధితురాలు ఆరోపించారు. తన వద్ద నుంచి తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు. అంతేకాకుండా తనను ప్రేమిస్తున్నానని చెబుతూ వెంటపడుతూ, తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని కూడా ఆమె ఆరోపించారు.

ఈ పరిణామాలతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, తనకు న్యాయం చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కోరారు. తన ఆరోపణలకు సంబంధించి ఫోన్‌పే లావాదేవీల వివరాలు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, బంగారం కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, ఇతర ఆధారాలను కూడా మంత్రికి అందజేసినట్లు తెలిపారు.

ఆర్ఎంకు మంత్రి వీడియో కాల్

బాధితురాలు తన సమస్యను వివరించిన వెంటనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తిరుపతి ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు వీడియో కాల్ చేశారు. మహిళ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆర్ఎంను ఆదేశించారు. ఆరోపణలు నిజమని విచారణలో తేలితే సంబంధిత కండక్టర్‌పై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రజలకు సేవలందించాల్సిన ఆర్టీసీ సిబ్బంది విధుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులతో మర్యాదగా, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఫిర్యాదులను తేలికగా తీసుకోకుండా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్టీసీ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని, సిబ్బంది ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తిరుపతి ఆర్ఎంకు మంత్రి సూచించారు. బాధితురాలికి చట్టపరంగా న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అయితే, బాధితురాలు చేసిన ఆరోపణలపై అధికారిక విచారణ పూర్తయి వాస్తవాలు వెల్లడికావాల్సి ఉంది. విచారణలో తేలే అంశాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉండనున్నాయి.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.