Amaravati: అమరావతిలో గ్రామకంఠాలపై మరోసారి సమగ్ర పరిశీలన!
Amaravati: అమరావతి గ్రామకంఠాల అంశంపై సమగ్ర పరిశీలనకు సీఎం చంద్రబాబు ఆదేశం. నిబంధనలు సక్రమంగా పాటిం చారా లేదా అని త్రిసభ్య కమిటీ పరిశీలన. పూర్తి వివరాలు ఇక్కడ!
Amaravati: అమరావతిలో గ్రామకంఠాలపై మరోసారి సమగ్ర పరిశీలన!
Amaravati: రాజధాని అమరావతి పరిధిలోని గ్రామకంఠాల అంశంపై ప్రభుత్వం మరోసారి సమగ్రంగా పరిశీలన చేపట్టనుంది. గ్రామకంఠాల నిర్ధారణ ప్రక్రియలో నిబంధనలు సక్రమంగా పాటించారా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఈ అంశాన్ని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రితో మంత్రి నారాయణ రాత్రి సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా 2014–19 మధ్యకాలంలో రాజధాని ప్రాంతంలో నోటిఫై చేసిన గ్రామకంఠాల విషయంలో పలు అంశాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని మంత్రి వివరించినట్లు తెలుస్తోంది.
దీంతో అప్పట్లో నోటిఫై చేసిన గ్రామకంఠాల పరిధి, వాటి నిర్ధారణకు అనుసరించిన విధానం, అందుబాటులో ఉన్న రికార్డులు, నిబంధనలకు అనుగుణంగా గ్రామ నివాస ప్రాంతాలను గుర్తించారా లేదా అనే అంశాలపై పూర్తిస్థాయి పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు.
గ్రామకంఠాల విషయంలో ఇప్పటికే భూముల మినహాయింపులకు సంబంధించి సీఆర్డీఏ పలు మార్గదర్శకాలను స్పష్టం చేసింది. 2014 డిసెంబర్ 8ను కటాఫ్ తేదీగా పరిగణిస్తూ, ఆ తేదీకి ముందే ఉన్న నిర్మాణాలు, రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలించి అర్హతను నిర్ణయించే విధానం అమల్లో ఉన్నట్లు సీఆర్డీఏ ఇటీవల వెల్లడించింది.
అయితే గతంలో గ్రామకంఠాలుగా గుర్తించిన ప్రాంతాల విషయంలోనూ ఇదే తరహాలో నిబంధనల ప్రాతిపదికన సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామకంఠం పరిధిని నిర్ణయించే సమయంలో అప్పటి రికార్డులు, భౌగోళిక పరిస్థితులు, నిర్మాణాలు, రెవెన్యూ వివరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా లేదా అనేది పరిశీలనలోకి రానుంది.
పూర్తిస్థాయిలో పరిశీలన నిర్వహించి, ప్రతి గ్రామకంఠానికి సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. ఆ నివేదికను సీఆర్డీఏ అథారిటీ ముందు ఉంచి తదుపరి నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
ఇప్పటికే అమరావతి ప్రాంతంలో గ్రామకంఠాల మినహాయింపులపై సీఆర్డీఏ స్పష్టత ఇవ్వడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాలతో గతంలో గుర్తించిన గ్రామకంఠాలపై కూడా సమీక్ష జరగనుండటంతో.. ఏయే ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం గ్రామకంఠాలను నిర్ధారించారు, ఎక్కడైనా పునఃపరిశీలన అవసరమా అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది.
అమరావతి గ్రామకంఠాల విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలను నిబంధనల ప్రాతిపదికన మరోసారి పరిశీలించి, సమగ్ర నివేదిక ఆధారంగా సీఆర్డీఏ అథారిటీ తదుపరి నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది....




