Amaravati: రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతాం!

Amaravati: రూ.లక్ష కోట్లతో 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్-రాయలసీమ రైజింగ్' ప్రాజెక్టును ప్రకటించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 1 Oct 2026 11:19 AM IST
Amaravati
X

Amaravati: రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతాం!

Amaravati: ఒకప్పుడు కరువుకు చిరునామాగా భావించిన రాయలసీమను దేశానికే కాకుండా ప్రపంచస్థాయి ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించిందని వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’ పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమం ద్వారా నీటి వనరులు, ఉద్యాన సాగు, గ్రామీణ రహదారులు, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు.

రాయలసీమలో పరిమిత వర్షపాతం, తరచూ ఎదురయ్యే కరువు, సాగునీటి కొరత, మార్కెట్ అనుసంధానం వంటి సమస్యలకు విడివిడిగా కాకుండా సమగ్ర పరిష్కారం చూపేలా ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ (IHDP) రూపొందించినట్లు మంత్రి వివరించారు. తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించడం ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమన్నారు.

ఈ ప్రాజెక్టు కింద సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులను సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో ప్రభుత్వ రంగం నుంచి రూ.40,352 కోట్లు, ప్రైవేటు రంగం నుంచి సుమారు రూ.60 వేల కోట్ల పెట్టుబడులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ పెట్టుబడుల్లో సాగునీటి రంగానికి రూ.20,884 కోట్లు, ఉద్యానవన రంగానికి రూ.14,906 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.4,562 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.

2026 ఆగస్టు నుంచి 2029 జూలై వరకు మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మొత్తం 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు ఉద్యాన విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు 9.6 లక్షల మంది రైతుల ఆదాయం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కూడా ఈ ప్రణాళికలో కీలక లక్ష్యంగా పేర్కొన్నారు.

మొదటి దశలో 2026–27లో రూ.12,066 కోట్లతో 72 క్లస్టర్లపై దృష్టి సారించనున్నారు. రెండో దశలో 2027–28లో రూ.15,036 కోట్లతో మరో 67 క్లస్టర్లు, మూడో దశలో 2028–29లో రూ.13,250 కోట్లతో మిగిలిన 62 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. రిజర్వాయర్లు, లిఫ్ట్ ఇరిగేషన్, చెరువులు, చివరి ఆయకట్టు వరకు నీటి సరఫరా వ్యవస్థలతో పాటు కీలక గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నారు.

సుమారు 9 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు కల్పించడం, మరో 4.3 లక్షల ఎకరాల ప్రస్తుత ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. రైతుల పంటలను వేగంగా మార్కెట్లకు తరలించేందుకు 5,721 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధిని ప్రతిపాదించారు. డ్రిప్, స్ప్రింక్లర్, ఫర్టిగేషన్ వంటి సూక్ష్మ సాగునీటి విధానాలను విస్తృతంగా అమలు చేసి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు చెప్పారు.

పంట సాగుతోనే ప్రభుత్వం బాధ్యత ముగియదని, ఉత్పత్తి నుంచి మార్కెట్ వరకు పూర్తి విలువ గొలుసును అభివృద్ధి చేయడమే ప్రణాళిక లక్ష్యమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, రవాణా, ఎగుమతుల వరకు రైతులను అనుసంధానం చేయనున్నారు. FPOలను బలోపేతం చేసి ప్రాసెసింగ్ సంస్థలు, ఎగుమతిదారులు, రిటైల్ మార్కెట్లతో నేరుగా అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మామిడి పల్ప్, అరటి ఉత్పత్తులు, టమాటా ప్యూరీ, మిర్చి ఒలియోరెసిన్, డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తద్వారా తాజా పండ్ల ధరల్లో హెచ్చుతగ్గుల ప్రభావం రైతులపై తగ్గే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు.

ఈ సమగ్ర ప్రణాళిక ద్వారా మూడో సంవత్సరం నుంచి సుమారు రూ.81 వేల కోట్ల అదనపు స్థూల విలువ జోడింపు (GVA) సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఉపాధి అవకాశాల పెంపు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కూడా లక్ష్యాల్లో భాగమన్నారు.

మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, నిమ్మ, బత్తాయి, అవకాడో వంటి పంటల ఉత్పత్తిని మరింత విస్తరించి రాయలసీమను దేశంలోని ప్రముఖ ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతు ఆదాయం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, రాయలసీమ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ లభించడం ‘రాయలసీమ రైజింగ్’ ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.