AP: స్వర్ణ వార్డు ఉద్యోగులకు ప్రమోషన్లు.. 1630 మందికి ప్రయోజనం!

AP: స్వర్ణ వార్డు ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు: నాలుగు కేటగిరీల ప్రమోషన్లకు జీవో జారీ, 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల మంజూరుతో 1,630 మందికి లబ్ధి - మంత్రి నారాయణ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 27 Sept 2026 5:23 PM IST
AP
X

AP: స్వర్ణ వార్డు ఉద్యోగులకు ప్రమోషన్లు.. 1630 మందికి ప్రయోజనం!

AP: స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న పురపాలక ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన ప్రమోషన్ చానల్స్‌కు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు మార్గం సుగమమైంది.

వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీలు గ్రేడ్-2, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తించనుంది. ఆయా కేటగిరీల్లో ఉద్యోగుల సర్వీస్, అర్హతలను పరిగణనలోకి తీసుకుని పదోన్నతులు కల్పించే ప్రక్రియ చేపట్టనున్నారు.

మరోవైపు స్వర్ణ వార్డుల్లో ఖాళీగా ఉన్న, మిగిలి ఉన్న పోస్టులను క్రమబద్ధీకరించడం ద్వారా కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ పోస్టుల ఏర్పాటు ద్వారా ఉద్యోగుల ప్రమోషన్లకు అవసరమైన తదుపరి స్థాయి పోస్టులు అందుబాటులోకి రానున్నాయి.

ఇందులో భాగంగా అర్హత ఉన్న వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించనున్నారు. ఈ ప్రమోషన్ల కారణంగా ఖాళీ అయ్యే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులను తదుపరి కేటగిరీకి చెందిన వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలతో భర్తీ చేయనున్నారు. దీంతో ఒక కేటగిరీలో పదోన్నతులు కల్పించడంతో పాటు, దాని ప్రభావంతో ఏర్పడే ఖాళీలను మరో కేటగిరీ ఉద్యోగులకు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసే విధంగా ప్రభుత్వం ప్రమోషన్ చానల్‌ను రూపొందించింది.

అదే సమయంలో వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ క్యాడర్లలో 815 పోస్టులను గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1కి అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో కేటగిరీలో 815 పోస్టుల చొప్పున మొత్తం 1630 పోస్టులు గ్రేడ్-1 స్థాయికి అప్‌గ్రేడ్ కానున్నాయి. దీంతో ఈ రెండు కేటగిరీలకు చెందిన 1630 మంది ఉద్యోగులకు పదోన్నతి పొందే అవకాశం ఏర్పడింది.

పురపాలక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల అనుభవానికి, వారు అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారాయణ తెలిపారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారా వారి సేవలకు ప్రోత్సాహం లభించడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న మున్సిపల్ సేవలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.

ఇక మిగిలిన మరో రెండు కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధికారుల కమిటీ సిఫార్సులు అందిన వెంటనే అవసరమైన నిబంధనలు జారీ చేసి, తదుపరి పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల మార్గం సులభం కానుంది. ఖాళీ పోస్టుల క్రమబద్ధీకరణ, క్యాడర్ అప్‌గ్రేడేషన్ ద్వారా ఉద్యోగులకు కెరీర్ ప్రోగ్రెషన్ కల్పించడంతో పాటు, పట్టణ పరిపాలనలో మానవ వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడనుంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.