Vijayawada: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల చలో విజయవాడపై ప్రభుత్వ స్పందన!
Vijayawada: స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ వర్గాల కీలక ప్రకటన: 1.14 లక్షల మందికి ఏఏఎస్, నోషనల్ ఇంక్రిమెంట్లపై ఆర్థిక శాఖ నివేదిక రాగానే నిర్ణయం.
Vijayawada: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల చలో విజయవాడపై ప్రభుత్వ స్పందన!
Vijayawada: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమంపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని స్పష్టం చేశాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సంతృప్తిగానే ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే కొందరు పనిగట్టుకుని ఉద్యోగులను ఆందోళనలు, సమ్మెల వైపు ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశాయి. ముఖ్యంగా ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్ల అంశంపై ఆర్థిక శాఖ నివేదిక వచ్చిన తర్వాత త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. నోషనల్ ఇంక్రిమెంట్లు అమలు చేస్తే ప్రభుత్వంపై సుమారు రూ.2,500 కోట్ల ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అదే సమయంలో సుమారు రూ.150 కోట్ల ఆర్థిక భారం పడుతున్నప్పటికీ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలు చేస్తున్నామని తెలిపాయి. ఆరేళ్లుగా ఒకే పోస్టులో పనిచేస్తున్న అర్హత కలిగిన 1.14 లక్షల మంది ఉద్యోగులకు ఏఏఎస్ వర్తింపజేస్తున్నట్టు స్పష్టం చేశాయి.
ఉద్యోగుల పదోన్నతుల అంశంలోనూ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శాఖలోని 18 కేడర్లకు ప్రమోషన్ ఛానళ్లను ఏర్పాటు చేశామని, ఇప్పటికే 14,331 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్టు తెలిపాయి. ఎనర్జీ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, వార్డు హెల్త్ సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ సహాయకులకు ప్రమోషన్ అవకాశాలు కల్పించినట్టు వివరించాయి.
ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు కూడా వారి మాతృ శాఖల్లో ప్రమోషన్ ఛానళ్లను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఆయా కేడర్ల ఉద్యోగులకు భవిష్యత్తులో పదోన్నతులకు మార్గం ఏర్పడిందని పేర్కొన్నాయి.
సెలవుల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని వెల్లడించాయి. ఉద్యోగులకు ఆటోమేటిక్ క్యాజువల్ లీవ్‌కు ఆమోదం ఇస్తున్నామని, అర్హత మేరకు ఆర్జిత సెలవులు, ఇతర సెలవులు, ఇంక్రిమెంట్లు అమలు చేస్తున్నామని స్పష్టం చేశాయి. సెలవులు, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఉద్యోగులకు విధులు కేటాయించరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపాయి.
ఉద్యోగులపై పని ఒత్తిడికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశామని, సమస్యలను నేరుగా తెలియజేసేందుకు గ్రీవెన్స్ సెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మరణ ప్రయోజనాల విషయంలోనూ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందికి ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు అందిస్తున్నామని తెలిపాయి. శాఖలో అర్హత కలిగిన 121 మందికి కారుణ్య నియామకాలు కల్పించినట్టు వెల్లడించాయి.
ఇక ఉద్యోగులపై పని భారం పెంచాలనే ఉద్దేశంతోనే G.O.Ms.No.11 జారీ కాలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని, నోషనల్ ఇంక్రిమెంట్లపై కూడా ఆర్థిక శాఖ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.




