Mangalagiri: ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం!

Mangalagiri: 6 నగరవనాలు, 3 ఎకో టూరిజం ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రకృతి పరిరక్షణతో పాటు ఉపాధి కల్పనే ధ్యేయమన్న నాగబాబు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 6 Oct 2026 3:05 PM IST
Mangalagiri
X

Mangalagiri: ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం!

Mangalagiri: ప్రకృతి పరిరక్షణతో పాటు ప్రజలకు ఉపాధి, పర్యాటక అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇవ్వడమే ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విధానమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు అన్నారు. ప్రకృతి, ప్రజల జీవనోపాధి, పర్యాటక రంగాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రంలో నగరవనాలు, ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

మంగళవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ ఆరు నగరవనాలు, మూడు ఎకో టూరిజం ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని సహజ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రాజెక్టులను రూపొందించినట్లు చెప్పారు. సముద్రతీర మడ అడవుల నుంచి నల్లమల అరణ్యాల వరకు, తూర్పు కనుమల నుంచి మారేడుమిల్లి కాఫీ తోటల వరకు ప్రకృతి, ప్రజలు, పర్యాటకాన్ని అనుసంధానించేలా కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు.

పట్టణాలకు పచ్చని ఊపిరి నగరవనాలు

బాపట్ల, చీరాల, కోటప్పకొండ, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్లలో మొత్తం 304.60 హెక్టార్ల విస్తీర్ణంలో నగరవనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవి కేవలం పార్కులు, వాకింగ్ ట్రాక్‌లకే పరిమితం కాకుండా పట్టణ ప్రజలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణాన్ని అందించే హరిత కేంద్రాలుగా ఉపయోగపడతాయన్నారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ప్రజలను ప్రకృతికి చేరువ చేయడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి అనుకూలమైన జీవన వాతావరణాన్ని కల్పించడంలో నగరవనాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

నల్లమల జంగిల్ సఫారీతో కొత్త ఆకర్షణ

ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వెలుగోడులో నల్లమల జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడంతో పాటు పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, వివిధ రకాల పక్షులను వాటి సహజ ఆవాసాల్లో చూసే అవకాశం పర్యాటకులకు లభిస్తుందని తెలిపారు.

జంగిల్ సఫారీ ద్వారా 80కి పైగా గ్రామీణ కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని నాగబాబు చెప్పారు. అడవులను పరిరక్షిస్తూనే వాటిపై ఆధారపడి జీవించే స్థానిక కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, స్థానిక ఆర్థికాభివృద్ధి, ఎకో టూరిజాన్ని సమన్వయం చేయవచ్చన్నారు.

మారేడుమిల్లికి అరోమా కెనపీ వాక్

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ మార్గాన్ని అభివృద్ధి చేసి గిరిజన యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గిరిజన యువత ట్రెక్కింగ్ గైడ్‌లుగా పనిచేస్తూ అక్కడి ప్రకృతి, జీవవైవిధ్యం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పర్యాటకులకు పరిచయం చేస్తారని చెప్పారు.

మారేడుమిల్లిలో రూ.కోటి వ్యయంతో అరోమా కెనపీ వాక్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కాఫీ తోటల మధ్య ఎలివేటెడ్ కాఫీ కెనపీ వాక్‌తో పాటు కాఫీ కేఫ్, బర్డ్ నెస్ట్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ కాఫీ తోటల ప్రత్యేకతను అనుభవించేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు మారేడుమిల్లి పర్యాటకానికి కొత్త ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.

ప్రకృతిని కాపాడుతూ స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, భవిష్యత్ తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని నాగబాబు తెలిపారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.