Amaravati: అంతర్జాతీయ కాఫీ దినోత్సవం - అరకు కాఫీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోస్ట్!
Amaravati: అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా అరకు కాఫీ ప్రత్యేకతను, గిరిజన రైతుల కష్టాన్ని కొనియాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక సందేశం.
Amaravati: అంతర్జాతీయ కాఫీ దినోత్సవం - అరకు కాఫీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోస్ట్!
Amaravati: అరకు కాఫీలోని ప్రతి కప్పులో తూర్పు కనుమల సువాసన ఉంటుంది. ఈ నేల సారం ఉంటుంది. మన గిరిజన రైతుల కష్టం, చెమట, అంకితభావం ఉంటాయి.
అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద అరకు కాఫీని గర్వంగా స్మరించుకుంటున్నాను.
నా దృష్టిలో అరకు కాఫీ కేవలం ఒక పానీయం కాదు... అది మన అడవులతో, మన గిరిజన సమాజాలతో, తరతరాలుగా వారు పరిరక్షించుకుంటూ వస్తున్న సంప్రదాయ జ్ఞానంతో ముడిపడిన జీవనగాథ.
తూర్పు కనుమల ఒడిలో పుట్టిన అరకు కాఫీ అరకు లోయల నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్ వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. పార్లమెంట్‌లో ప్రత్యేక స్టాళ్ల ద్వారా అరకు కాఫీని పరిచయం చేయడం, ఒక స్థానిక ఉత్పత్తి ఎలా మన నేల కథను, మన ప్రజల ప్రతిభను దేశానికే కాదు ప్రపంచానికి చాటిచెప్పగలదో నిరూపిస్తోంది.
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా అరకు కాఫీ ప్రత్యేకతను, దాని సాగులో భాగస్వాములైన గిరిజన కుటుంబాల కృషిని పలుమార్లు ప్రస్తావించారు.
అరకు కాఫీ వెనుక ఉన్న ప్రతి గిరిజన రైతును మనం గుర్తించాలి. ఈ కాఫీకి జీవం పోస్తున్న అడవులను కాపాడాలి. ఈ అద్భుతమైన పంటకు పుట్టినిల్లు అయిన తూర్పు కనుమలను పరిరక్షించాలి.
ఆంధ్రప్రదేశ్ కొండల్లో పండే అరకు కాఫీ... ప్రపంచంలోని ప్రతి మూలకు చేరాలి.
ఎందుకంటే
అరకు కాఫీ ఒక కప్పు రుచి మాత్రమే కాదు.
అది మన నేల కథ.
మన గిరిజనుల శ్రమకు ప్రతిరూపం.
మన తూర్పు కనుమల సువాసన.
మన ఆంధ్రప్రదేశ్ గర్వం.
అందరికీ అంతర్జాతీయ కాఫీ దినోత్సవ శుభాకాంక్షలు!
— పవన్ కల్యాణ్




