తీవ్రవాయుగుండం.. కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం..

Amaravati: తీవ్రవాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.

Hari Kishan  AP Bureau Chief
Published on: 23 Sept 2026 9:59 PM IST
Amaravati
X

తీవ్రవాయుగుండం.. కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం..

అమరావతి: పశ్చిమమధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం పశ్చిమ దిశగా కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం కళింగపట్నానికి 30 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 90 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 160 కిలోమీటర్ల దూరంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించారు.

బుధవారం రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య ఉత్తర కోస్తా–దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల మధ్య, ముఖ్యంగా కళింగపట్నం సమీపంలో తీవ్రవాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఆర్టీజీఎస్అవేర్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో క్షేత్రస్థాయిలోని అధికారులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు చెప్పారు.

తీవ్రవాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా మరో 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

అత్యవసర సహాయక చర్యల కోసం ప్రభావిత జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళంలో 3, అల్లూరిలో 2, విశాఖలో 2, పోలవరంలో 1, అనకాపల్లిలో 1 చొప్పున మొత్తం 5 ఎస్డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో 112, 1070, 1800 4250101 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

గురువారం వర్ష సూచన: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.

బుధవారం సాయంత్రం 7 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 88.2 మిల్లీమీటర్లు, లక్ష్మీనర్సుపేటలో 73.7, ఎన్టీఆర్ జిల్లా పుట్రేలలో 67.6, రెడ్డిగూడెంలో 64.1, ఏ.కొండూరులో 62.8, ఏలూరు జిల్లా ఏదులగూడెంలో 57, కృష్ణా జిల్లా పెదయెరుకపాడులో 53.7, ఎన్టీఆర్ జిల్లా కొర్లమండలో 50.7, చందర్లలో 49, శ్రీకాకుళం జిల్లా మందసలో 44.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇక మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు పలాసలో అత్యధికంగా 141 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జి.మాడుగులలో 100, భీమునిపట్నంలో 97, కొయ్యలగూడెంలో 94, కూనవరంలో 91, గోపాలపురంలో 89, తాడేపల్లిగూడెంలో 80, సబ్బవరంలో 78, అయినవిల్లిలో 76, బలిజిపేటలో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.