Amaravati: ఆర్థిక ప్రగతి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి: సీఎం చంద్రబాబు!

Amaravati: ఆర్థిక ప్రగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. నియోజకవర్గ స్థాయిలో విజన్ యూనిట్ ప్లాన్లకు పిలుపు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 10 Oct 2026 8:13 AM IST
Amaravati
X

Amaravati: ఆర్థిక ప్రగతి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి: సీఎం చంద్రబాబు!

Amaravati: రాష్ట్ర ఆర్థిక ప్రగతి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా రూపొందిస్తున్న ఆర్థిక నివేదికలను కేవలం సమీక్షలకే పరిమితం చేయకుండా.. వాటి ఆధారంగా వివిధ రంగాల్లో అవసరమైన మార్పులు, అభివృద్ధి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో కనిపిస్తున్న వృద్ధి తరహాలోనే సేవలు, పరిశ్రమల రంగాలు కూడా పుంజుకునేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

సెప్టెంబర్ నెలకు సంబంధించిన రాష్ట్ర ఆర్థిక నివేదికను ప్రణాళిక శాఖ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వివిధ రంగాల పనితీరు, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అధికారులు అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు.

నివేదికల ఆధారంగా మార్పులు తీసుకురావాలి

ప్రతి నెలా రూపొందించే ఆర్థిక నివేదికలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆయా రంగాల్లో సాధిస్తున్న ప్రగతి, ఎదురవుతున్న సమస్యలు, మెరుగుపరచుకోవాల్సిన అంశాలను నివేదికల ఆధారంగా స్పష్టంగా వివరించాలని చెప్పారు. నివేదికలపై చర్చించడంతోనే సరిపెట్టకుండా.. వాటిలో వెల్లడైన అంశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఉన్నతాధికారుల నుంచి జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ ఈ కార్యాచరణకు అనుగుణంగా పనిచేయాలని స్పష్టం చేశారు. వివిధ శాఖల పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. అవసరమైన సవరణలు చేపట్టడం ద్వారా అభివృద్ధి ఫలితాలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు.

వ్యవసాయంతో పాటు ఇతర రంగాలూ పుంజుకోవాలి

రాష్ట్రంలో వ్యవసాయ రంగం వృద్ధి సాధిస్తున్నప్పటికీ.. సేవలు, పరిశ్రమల రంగాల్లోనూ అదే స్థాయిలో పురోగతి కనిపించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రణాళిక శాఖ రూపొందిస్తున్న ఆర్థిక నివేదికలను ఆధారంగా చేసుకుని సంబంధిత శాఖలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆర్థిక ప్రగతి అనేది గణాంకాలకే పరిమితం కాకుండా.. ప్రజల జీవన ప్రమాణాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావాలని అన్నారు.

వివిధ రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు నిపుణుల సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందుకోసం నిపుణుల బృందాలను గుర్తించి, వారి సేవలను వినియోగించుకోవాలని అధికారులకు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి.. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా వాటిని అమలు చేయాలని ఆదేశించారు.

నియోజకవర్గ స్థాయిలో విజన్ యూనిట్ ప్లాన్లు

రాష్ట్ర అభివృద్ధి కోసం నియోజకవర్గాల స్థాయిలో ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను గుర్తించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవలకు ప్రపంచ మార్కెట్లలో అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

నియోజకవర్గాల స్థాయిలో విజన్ యూనిట్ ప్లాన్లను సమర్థంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ప్రణాళికల అమలు తీరును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్థానికంగా ఉన్న అవకాశాలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించాలన్న ప్రధాని సూచనలకు అనుగుణంగా ముందుకు సాగాలని అధికారులకు తెలిపారు.

అదే సమయంలో ధరలు పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక వృద్ధి, రంగాల అభివృద్ధి, ప్రజల కొనుగోలు శక్తి మధ్య సమతుల్యత ఉండేలా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఆర్థిక, ప్రణాళిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.