పార్టనర్‌షిప్ సమ్మిట్‌-2026కు ఏపీ సర్కార్‌ భారీ కార్యాచరణ..

Amaravati: ఏపీలో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2026 నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష. అక్టోబర్ 7 నుంచి రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో రీజినల్ కాన్ఫరెన్సులు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 24 Sept 2026 8:00 PM IST
Amaravati
X

పార్టనర్‌షిప్ సమ్మిట్‌-2026కు ఏపీ సర్కార్‌ భారీ కార్యాచరణ..

అమరావతి: విశాఖ వేదికగా నవంబర్‌ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌-2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సమ్మిట్‌ కేవలం పెట్టుబడులపై ఎంవోయూలు చేసుకునే కార్యక్రమంగా కాకుండా.. పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా, ఆంధ్రప్రదేశ్‌ బ్రాండింగ్‌ను మరింత పెంచేలా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ఐదు రీజినల్‌ కాన్ఫరెన్సులు నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతి కేంద్రాలుగా ఈ సదస్సులు జరగనున్నాయి.

ప్రాంతాల ప్రత్యేకతలకు అనుగుణంగా పెట్టుబడుల ఆకర్షణ

ప్రతి ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత, అక్కడ అందుబాటులో ఉన్న వనరులు, మౌలిక వసతులు, పరిశ్రమల అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రీజినల్‌ కాన్ఫరెన్సుల్లో చర్చలు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాలకు అనువైన రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు.. అక్కడికక్కడే ఎంవోయూలు చేసుకునేలా ఈసారి విధానాన్ని మార్చారు. దీంతో పెట్టుబడిదారులతో చర్చలు జరిపి.. ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

అక్టోబర్‌ 7 నుంచి రీజినల్‌ సదస్సులు

అక్టోబర్‌ 7 నుంచి 26 వరకు ఐదు రీజినల్‌ కాన్ఫరెన్సులు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 7న విశాఖలో తొలి సదస్సు జరగనుంది. ఏఐ, డేటా సెంటర్లు, ఐటీ, ఫిన్‌టెక్‌, సెమీకండక్టర్లు, గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లు, ఫార్మా, మెడ్‌టెక్‌ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

అక్టోబర్‌ 12న కాకినాడలో సదస్సు జరగనుంది. మారిటైమ్‌, షిప్‌బిల్డింగ్‌, కెమికల్స్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, అమోనియా, ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి రంగాలపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.

అక్టోబర్‌ 16న గుంటూరులో నిర్వహించే కాన్ఫరెన్స్‌లో గవర్నెన్స్‌, క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, క్వాంటమ్‌ వ్యాలీ, ఎమర్జింగ్‌ టెక్నాలజీలపై దృష్టి పెట్టనున్నారు.

అక్టోబర్‌ 23న అనంతపురంలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, ఆటోమోటివ్‌, నేచురల్‌ ఫార్మింగ్‌, హార్టికల్చర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ రంగాలపై చర్చలు జరగనున్నాయి.

అక్టోబర్‌ 26న తిరుపతిలో టూరిజం, హాస్పిటాలిటీ, ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌, ఆటోమోటివ్‌, స్పేస్‌, ఫుట్‌వేర్‌ రంగాలను ప్రాధాన్యంగా తీసుకోనున్నారు.

ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక ప్రాధాన్యత

రీజినల్‌ కాన్ఫరెన్సుల్లో ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం కల్పించాలని సీఎం సూచించారు. ప్రతి కాన్ఫరెన్స్‌లో ‘ఎంఎస్ఎంఈ షోకేస్‌’ ఏర్పాటు చేసి చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశాలు కల్పించనున్నారు. పెట్టుబడులు, మార్కెట్‌, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తుల ప్రదర్శన వంటి అంశాల్లో ఎంఎస్ఎంఈలకు వేదిక కల్పించనున్నారు.

అదే సమయంలో మరో 30 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు ముందే శంకుస్థాపనలు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటవడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

స్టార్టప్‌లకు ‘షార్క్‌ ట్యాంక్‌’ తరహా వేదిక

స్టార్టప్‌ రంగానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే స్టార్టప్‌లకు పెట్టుబడులు అందించే వారిని అనుసంధానం చేసేందుకు ‘షార్క్‌ ట్యాంక్‌’ తరహా విధానాన్ని తీసుకురావాలని సీఎం సూచించారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లను రీజినల్‌ కాన్ఫరెన్సులతో అనుసంధానం చేయాలని ఆదేశించారు.

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో వ్యాపార ఆలోచనలు, ఆవిష్కరణలపై ఆసక్తి పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఏడో తరగతి నుంచే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు సంబంధించిన అంశాలను పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం కాకుండా.. భవిష్యత్‌లో ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే ఆలోచనతో కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.

పెట్టుబడుల గ్రౌండింగ్‌పై ప్రత్యేక దృష్టి

పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు ముందే రాష్ట్రంలో ఇప్పటికే కుదిరిన ఎంవోయూలను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గతంలో కుదిరిన ఎంవోయూలను కన్వర్ట్‌ చేయడం, ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులను గ్రౌండింగ్‌ చేయడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై సీఎం సమీక్షలో చర్చించారు.

2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.22.57 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 714 ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదిరినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో రూ.16.6 లక్షల కోట్ల విలువైన 473 ప్రాజెక్టులు కన్వర్ట్‌ అయ్యాయని తెలిపారు. కన్వర్ట్‌ అయిన ప్రాజెక్టుల్లో ఇప్పటికే 247 ప్రాజెక్టులు గ్రౌండింగ్‌ అయినట్లు వెల్లడించారు.

అక్టోబర్‌ చివరి నాటికి పెట్టుబడి ప్రతిపాదనల్లో 80 శాతం కన్వర్ట్‌ చేయాలని, కన్వర్ట్‌ అయిన ప్రాజెక్టుల్లో 75 శాతం గ్రౌండింగ్‌ చేసేలా శాఖలు పనిచేయాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు.

జిల్లాల వారీగా ‘ఇన్వెస్ట్‌’ కార్యక్రమాలు

ఒక్క విశాఖకే పెట్టుబడులను పరిమితం చేయకుండా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెట్టుబడుల అవకాశాలను ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కడపలో నిర్వహించిన ‘ఇన్వెస్ట్‌ కడప’ తరహా కార్యక్రమాలను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తే పెట్టుబడులను మరింతగా ఆకర్షించవచ్చని సీఎం సూచించారు. స్థానిక వనరులు, మానవ వనరులు, భూమి, రవాణా, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను పెట్టుబడిదారులకు వివరించనున్నారు.

దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలతో ప్రచారం

పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఇప్పటికే రోడ్‌షోలు ప్రారంభమయ్యాయి. చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరులో దేశీయ రోడ్‌షోలు నిర్వహించారు. సెప్టెంబర్‌ 25న అహ్మదాబాద్‌, సెప్టెంబర్‌ 28న హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30న ముంబైలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

అంతర్జాతీయంగా సింగపూర్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, తైవాన్‌లో రోడ్‌షోలు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 1 వరకు స్వీడన్‌లో, అక్టోబర్‌ 13, 14 తేదీల్లో జపాన్‌లో, అక్టోబర్‌ 15, 16 తేదీల్లో చైనాలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

21 దేశాల ప్రతినిధుల భాగస్వామ్యం

పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు ఇప్పటికే 11 మంది అంతర్జాతీయ మంత్రులు, 26 మంది అంతర్జాతీయ స్పీకర్లు, 21 దేశాల ప్రతినిధులు ఖరారైనట్లు ప్రభుత్వం తెలిపింది. సింగపూర్‌, కంబోడియా, మయన్మార్‌, స్లోవాక్‌ రిపబ్లిక్‌, లిథువేనియా, బల్గేరియా, మారిషస్‌, బహ్రెయిన్‌, యూఏఈ, గ్వాటెమాలా, మొజాంబిక్‌ తదితర దేశాల నుంచి మంత్రులు, ప్రతినిధులు హాజరుకానున్నారు.

ఈసారి ‘ట్రేడ్‌, టెక్నాలజీ, ట్రస్ట్‌, థాట్‌ లీడర్‌షిప్‌’ ప్రధాన థీమ్‌గా నిర్ణయించారు. పెట్టుబడులతో పాటు సాంకేతికత, వాణిజ్యం, ఆవిష్కరణలు, భవిష్యత్‌ ఆర్థిక అవకాశాలపై చర్చలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

అక్టోబర్‌ 8న ఢిల్లీలో కర్టెన్‌ రైజర్‌

పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు ముందు అక్టోబర్‌ 8న న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. దౌత్యవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు, మీడియా సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. సమ్మిట్‌ లక్ష్యాలు, పెట్టుబడి అవకాశాలు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పారిశ్రామిక వనరులను ఈ కార్యక్రమంలో వివరించనున్నారు.

కన్వెన్షన్‌ సెంటర్లపై సీఎం ప్రత్యేక దృష్టి

విశాఖలోని కాపులుప్పాడలో నిర్మించనున్న కన్వెన్షన్‌ సెంటర్‌ భవిష్యత్‌ అవసరాలకు కూడా ఉపయోగపడేలా రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరంలో నిర్మిస్తున్న కన్వెన్షన్‌ సెంటర్‌ను గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అమరావతి, తిరుపతి, అనంతపురం కన్వెన్షన్‌ సెంటర్ల డిజైన్లు ప్రత్యేకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌-2026ను కేవలం భారీ పెట్టుబడి ప్రకటనల వేదికగా కాకుండా.. రీజినల్‌ స్థాయిలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, విద్యార్థుల ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది ప్రభుత్వ కార్యాచరణగా కనిపిస్తోంది. ఇప్పటికే కుదిరిన ఎంవోయూలను వేగంగా గ్రౌండింగ్‌ చేయడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, జిల్లాల వారీగా పారిశ్రామిక అవకాశాలను ప్రోత్సహించడం ద్వారా సమ్మిట్‌కు ముందే పెట్టుబడుల వాతావరణాన్ని మరింత చురుగ్గా మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.