Vijayawada: ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు సామాన్యుల పండుగగా సాగాలి: సీఎం!

Vijayawada: ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జాతీయ సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్ 2.0 ఏర్పాట్లపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 11 Oct 2026 6:05 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు సామాన్యుల పండుగగా సాగాలి: సీఎం!

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విజయవాడలో వరుసగా జరగనున్న దసరా ఉత్సవాలు, జాతీయ సరస్‌ మేళా, విజయవాడ ఉత్సవ్‌ 2.0 కార్యక్రమాలపై ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యం

దసరా ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా హాజరుకానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు సూచించారు. వీఐపీల రాకపోకల కారణంగా సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దసరా ఉత్సవాలు సామాన్యుల దసరాగా ఉండాలని, వీఐపీలకే పరిమితమైన కార్యక్రమాలుగా మారకూడదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అన్ని వర్గాలు సహకరించాలని కోరారు.

దర్శనాల విధానం, భక్తులకు కల్పించే సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లపై తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రముఖుల పర్యటనల నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించాల్సి వస్తే వాహనదారులు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు తగ్గించేలా ప్రత్యామ్నాయ వ్యూహాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకునే నిర్ణయాలకు సమన్వయంతో సహకరించాలని సూచించారు.

అక్టోబర్‌ 13 నుంచి జాతీయ సరస్‌ మేళా

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో అక్టోబర్‌ 13 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్‌ మేళా–2026 ఏర్పాట్లపైనా సీఎం సమీక్షించారు. దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఒకే వేదికపై ప్రదర్శించి, విక్రయించేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళా పారిశ్రామికవేత్తల కోసం మొత్తం 576 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా సంఘాలు, గ్రామీణ పారిశ్రామికవేత్తల కోసం 208 స్టాళ్లు కేటాయించినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా సరస్‌ మేళాను ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌ కింద ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించేందుకు ఈ మేళా వేదిక కావాలని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుర్గమ్మ దర్శనంతో పాటు సరస్‌ మేళాకు హాజరుకానున్న నేపథ్యంలో ఆమె పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపైనా సమీక్షలో చర్చించారు.

సంప్రదాయాలు చాటేలా విజయవాడ ఉత్సవ్‌ 2.0

విజయవాడ ఉత్సవ్‌ 2.0ను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని సీఎం సూచించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించాలని, దసరా సందర్భంగా జరిగే వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనే వాతావరణం కల్పించాలని అన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రవాణా, భద్రత, పారిశుధ్యం, ఇతర మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ సమీక్షలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్‌, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, ఎన్టీఆర్‌ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.