AP: కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ!

AP: ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఈఏపీ ప్రాజెక్టుల నిధులపై చర్చించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 7 Oct 2026 11:00 PM IST
AP
X

AP: కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ!

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాలను మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణ, అవసరమైన ప్రణాళికలు, సంబంధిత శాఖల సమన్వయంపై సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించారు.

ఇటీవల గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై, ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యాన రంగానికి మరింత ఊతమిచ్చే ఈ ప్రాజెక్టు విజయవంతంగా అమలు కావడానికి కేంద్ర సహకారం అవసరమని సీఎం వివరించినట్లు సమాచారం.

అలాగే ఎక్సటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాల అంశంపైనా ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక వనరులు, కేంద్ర సహకారం, ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన అంశాలను సీఎం కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రాధాన్యతలను కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే దిశగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మలా సీతారామన్‌తో జరిగిన భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.