Nellore: పేదలకు శాశ్వత ఆస్తి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: సీఎం చంద్రబాబు!
Nellore: నెల్లూరు సర్వేపల్లి కట్ట వాసులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పేదలకు శాశ్వత ఆస్తి, ఆత్మగౌరవం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
Nellore: పేదలకు శాశ్వత ఆస్తి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: సీఎం చంద్రబాబు!
నెల్లూరు: పేద కుటుంబాలకు భద్రత, ఆత్మగౌరవంతో పాటు శాశ్వత ఆస్తి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరులోని సర్వేపల్లి కట్ట ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన.. లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి శాశ్వత హక్కులు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 701 మంది మహిళలకు పట్టాలు అందించడం మహిళా సాధికారతకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఇచ్చిన హామీని 28 నెలల పాలనలో ఆచరణలో చూపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టామని వెల్లడించారు. వచ్చే సంక్రాంతి నాటికి నెల్లూరు నగరంలో మరో 4 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో 60 వేల కుటుంబాలకు రూ.52 వేల కోట్ల విలువైన ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో అందించామని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ కల్పించేందుకు దాదాపు రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.1.80 లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు, ఇంటర్నెట్ వంటి సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సంక్షేమానికి పెద్దపీట
సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజీ పడటం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. సామాజిక పింఛన్ల కోసం ప్రతి నెలా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలు ఇప్పటికే 100 కోట్ల ప్రయాణాలు చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. దీపం-2 పథకం కింద సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
రైతులు, నేతన్నలు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గీత కార్మికులకు ఎక్సైజ్ దుకాణాలు, వడ్డెరలకు మైనింగ్ లీజులు కల్పించామని వివరించారు. ఇప్పటికే 5.50 లక్షల ఇళ్లను అందించామని, ఇటీవల మరో మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్లను ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం రీసర్వే పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలపై వ్యక్తుల చిత్రాలు ముద్రించిందని విమర్శించారు. వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో భద్రతా ప్రమాణాలతో కూడిన పాస్ పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. గతంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పేదరికం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు పీ4 వంటి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. పట్టణాలను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతామని చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మేయర్లు, చైర్మన్లను నేరుగా ఎన్నుకునే విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
నీతి, నిజాయితీ, నిస్వార్థంతో పనిచేసే నాయకులను ప్రజలు ఎన్నుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు రాష్ట్రంలోనూ, కుటుంబాల జీవితాల్లోనూ మార్పునకు కారణమైందన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా గతం కంటే రెట్టించిన వేగంతో పనిచేస్తున్నానని చెప్పారు. శాశ్వత ఇళ్ల పట్టాలు అందుకున్న వారందరికీ ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తానని వెల్లడించారు.




