Amaravati: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రతిపాదనలకు ఆమోదం!

Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు అమరావతి సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ. అసెంబ్లీ స్పైర్ నిర్మాణం, భారీ పరిశ్రమలు, భూ కేటాయింపులపై ఆమోదం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 23 Sept 2026 10:46 AM IST
Amaravati
X

Amaravati: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రతిపాదనలకు ఆమోదం!

Amaravati: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నేడు అమరావతిలో జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, పరిశ్రమలు, భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

అమరావతిలో నిర్మించనున్న నూతన అసెంబ్లీ భవనానికి సంబంధించి కీలక ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అసెంబ్లీ ఐకానిక్ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పైర్ నిర్మాణానికి రూ.662 కోట్లతో టెండర్లు పిలిచేందుకు పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నారు.

అలాగే రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్‌పీఎస్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,548 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచే ప్రతిపాదనపైనా నిర్ణయం తీసుకోనున్నారు. పాఠశాలలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా కేబినెట్ ముందుకు రానున్నాయి.

రాజధాని ప్రాంతంలో ఎకరా కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు రెండో దశలో కూడా మొదటి పూలింగ్ తరహాలోనే ఎకరాకు రూ.40 వేల కౌలు చెల్లించే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ఇక రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కూడా కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మొత్తం రూ.22,251 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే ప్రతిపాదనలు ఉండగా.. వీటి ద్వారా 19,889 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది.

విశాఖపట్నంలో డెలాయిట్ సంస్థ పెట్టుబడికి కూడా ఆమోదం లభించనుంది. రూ.43.75 కోట్ల పెట్టుబడితో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనుండగా.. సుమారు 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రతిపాదనల్లో ఉంది.

మచిలీపట్నంలో భారీ షిప్‌యార్డు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ సంస్థ సుమారు రూ.8 వేల కోట్ల పెట్టుబడితో 400 ఎకరాల్లో బ్రౌన్‌ఫీల్డ్ షిప్‌యార్డును ఏర్పాటు చేయనుంది. 2033 నాటికి షిప్‌యార్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

పల్నాడు జిల్లాలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో మైహోమ్ సిమెంట్ కర్మాగారం ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది.

విజయనగరంలో కోకా కోలా సంస్థ రూ.842 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనపైనా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు, ఇతర పెట్టుబడి ప్రతిపాదనలపై కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.