Machilipatnam: మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్.. రూ.8 వేల కోట్ల పెట్టుబడి!
Machilipatnam: మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం. రూ.8 వేల కోట్ల పెట్టుబడితో రక్షణ రంగ ప్రాజెక్టు, 10 వేల మందికి ఉపాధి.
Machilipatnam: మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్.. రూ.8 వేల కోట్ల పెట్టుబడి!
Machilipatnam: మచిలీపట్నం కేంద్రంగా భారీ రక్షణ రంగ ప్రాజెక్టుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గోవా షిప్‌యార్డ్ కంపెనీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో షిప్‌యార్డ్ ఏర్పాటు చేయడానికి కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు కేబినెట్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మచిలీపట్నం పోర్టును కేంద్రంగా చేసుకుని సుమారు రూ.8 వేల కోట్ల పెట్టుబడితో భారీ షిప్‌యార్డ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రక్షణ రంగానికి అవసరమైన అత్యాధునిక యుద్ధ నౌకల తయారీతో పాటు నౌకల మరమ్మతులు, నిర్వహణకు ఈ కేంద్రం కీలకంగా మారనుందని చెప్పారు. ముఖ్యంగా భారత నౌకాదళం, కోస్టు గార్డుకు అవసరమైన ఆధునిక యుద్ధ నౌకలను ఇక్కడ తయారు చేసే అవకాశం ఉండటం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరమన్నారు.
గోవా వెలుపల గోవా షిప్‌యార్డ్ కంపెనీ ఏర్పాటు చేయనున్న అతిపెద్ద రక్షణ రంగ ప్రాజెక్టు మచిలీపట్నంలో రావడం గర్వకారణమని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మచిలీపట్నం ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయని తెలిపారు. షిప్‌యార్డ్ ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అనుబంధ పరిశ్రమలు, సేవా రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు షిప్‌యార్డ్‌కు అనుబంధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ ప్రాజెక్టు ఊతమిస్తుందని చెప్పారు.
మచిలీపట్నం పోర్టు అభివృద్ధితో పాటు రక్షణ రంగంలో భారీ ప్రాజెక్టు రావడం ఈ ప్రాంతానికి కీలక పరిణామమని మంత్రి పేర్కొన్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న మచిలీపట్నం భవిష్యత్‌లో ఆధునిక పారిశ్రామిక, రక్షణ రంగ కేంద్రంగా ఎదగడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అన్నారు.
మచిలీపట్నం చరిత్రలో గోవా షిప్‌యార్డ్ ప్రాజెక్టు మరో కలికితురాయిగా నిలవబోతోందని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పోర్టు ఆధారిత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు మరింత బలం చేకూరుస్తుందని తెలిపారు. రక్షణ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు.




