AP: ఏపీలో ఏ4 మద్యం షాపుల రెన్యూవల్ ప్రక్రియ వేగవంతం!
AP: ఏపీలో ఏ4 మద్యం షాపుల రెన్యూవల్‌కు ఊపందుకున్న స్పందన. 1,970 షాపుల దరఖాస్తులతో రూ.403.25 కోట్ల ఆదాయం. సెప్టెంబర్ 21తో ముగియనున్న గడువు.
AP: ఏపీలో ఏ4 మద్యం షాపుల రెన్యూవల్ ప్రక్రియ వేగవంతం!
AP: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఏడాదికి ఏ4 మద్యం షాపుల లైసెన్స్ రెన్యూవల్ ప్రక్రియకు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,652 ఏ4 మద్యం షాపుల్లో ఇప్పటివరకు 1,970 షాపుల నిర్వాహకులు రెన్యూవల్‌కు ముందుకు వచ్చారు. లైసెన్స్ రెన్యూవల్‌కు సెప్టెంబర్ 21వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో.. చివరి రోజుల్లో మరిన్ని దరఖాస్తులు, చెల్లింపులు జరిగే అవకాశం ఉంది.
రెన్యూవల్‌కు ముందుకు వచ్చిన 1,970 షాపుల్లో ఇప్పటివరకు 1,220 షాపులు పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లింపులు చేశాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.403.25 కోట్ల ఆదాయం సమకూరింది. చెల్లింపులు చేసిన షాపుల్లో 686 షాపులు పూర్తి మొత్తాన్ని చెల్లించగా.. మరో 534 షాపులు పాక్షికంగా చెల్లింపులు చేశాయి. దీంతో రెన్యూవల్‌కు ఆసక్తి చూపిన షాపుల్లో 61.9 శాతం ఇప్పటికే చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించినట్లైంది.
జిల్లాల వారీగా చూస్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెన్యూవల్‌కు ముందుకు వచ్చిన మొత్తం 30 షాపుల నుంచి చెల్లింపులు జరిగాయి. విశాఖపట్నం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రెన్యూవల్‌కు ముందుకు వచ్చిన షాపుల్లో 85 శాతం చెల్లింపులు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 84 శాతం, తూర్పుగోదావరిలో 77 శాతం, ఏలూరు జిల్లాలో 75.5 శాతం చెల్లింపులు నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం రెన్యూవల్ ప్రక్రియ ఇంకా నెమ్మదిగా సాగుతోంది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 1,682 షాపులు ఇప్పటివరకు రెన్యూవల్‌పై ఆసక్తి చూపలేదు. అదేవిధంగా 750 షాపులు రెన్యూవల్‌కు ముందుకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపు చేయలేదు. దీంతో గడువు ముగిసేలోపు ఈ షాపుల నిర్వాహకులు చెల్లింపులు చేస్తారా లేదా అన్నది కీలకంగా మారింది.
ప్రభుత్వానికి ఇప్పటివరకు వచ్చిన రూ.403.25 కోట్ల ఆదాయంలో వివిధ రకాల ఫీజులు, రెన్యూవల్ చెల్లింపులు ఉన్నాయి. రెన్యూవల్ ఆర్ఈటీ, అప్లికేషన్ ఫీజు రూపంలో రూ.236.48 కోట్లు సమకూరాయి. వార్షిక ఆర్ఈటీ ద్వారా రూ.145.03 కోట్లు, పర్మిట్ రూమ్ ఆర్ఈటీ ద్వారా మరో రూ.21.81 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి.
2026–27 ఏడాదికి ఏ4 మద్యం షాపుల లైసెన్స్ రెన్యూవల్ ప్రక్రియలో ఇప్పటివరకు దాదాపు సగానికి పైగా షాపులు ఆసక్తి చూపినప్పటికీ, ఇంకా గణనీయ సంఖ్యలో షాపులు రెన్యూవల్‌కు ముందుకు రావాల్సి ఉంది. సెప్టెంబర్ 21 గడువు నేపథ్యంలో మిగిలిన షాపుల విషయంలో వచ్చే స్పందనపై మద్యం షాపుల తదుపరి ప్రక్రియ ఆధారపడనుంది.




