అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు.. గిరిజన రైతులకు మరింత లాభం.. ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు

Amaravati: అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్ది, గిరిజన రైతుల ఆదాయం పెంచుతామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 1 Oct 2026 4:16 PM IST
Amaravati
X

అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు.. గిరిజన రైతులకు మరింత లాభం.. ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా అరకు కాఫీ ప్రత్యేకతను, దాని వెనుక ఉన్న గిరిజన రైతుల కృషిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఉదయం తొలి కాఫీ సిప్‌తోనే రోజు ప్రారంభమవుతుందని, తనకు మాత్రం అది ఆంధ్రప్రదేశ్‌ అరకు కొండల్లో పండే అరకు కాఫీతో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

అరకు కాఫీ కేవలం ఒక పానీయం కాదని.. ఆంధ్రప్రదేశ్‌ గిరిజన ప్రాంతాల ప్రకృతి, సంస్కృతి, రైతుల శ్రమకు ప్రతీక అని తెలిపారు. కొండ ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ కాఫీ సాగు చేస్తున్న గిరిజన రైతుల కష్టానికి అంతర్జాతీయ మార్కెట్‌లో తగిన గుర్తింపు, ప్రతిఫలం దక్కేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అరకు కాఫీని ప్రపంచస్థాయి బ్రాండ్‌గా అభివృద్ధి చేయడం ద్వారా దాని విలువను పెంచి, ఆ ప్రయోజనం నేరుగా స్థానిక రైతులకు చేరేలా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. కేవలం కాఫీ గింజలను విక్రయించడం కాకుండా.. నాణ్యత పెంపు, ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌, బ్రాండింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటి రంగాల్లో అవకాశాలను విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లలో అరకు కాఫీకి మరింత డిమాండ్‌ పెరిగితే, దాని ప్రభావం కాఫీ సాగు చేస్తున్న రైతుల ఆదాయంపైనా పడుతుందని తెలిపారు. రైతులకు మెరుగైన మార్కెట్‌ అనుసంధానం, న్యాయమైన ధరలు, ఆధునిక సాగు పద్ధతులు, నాణ్యమైన మొక్కలు, సాంకేతిక సహకారం అందించడం ద్వారా కాఫీ సాగును మరింత లాభదాయకంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

అరకు ప్రాంతాన్ని ప్రపంచస్థాయి కాఫీ గమ్యస్థానంగా అభివృద్ధి చేయడంతో పాటు, కాఫీ పర్యాటకం ద్వారా కూడా స్థానిక గిరిజన సమాజాలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతు పండించిన కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాకుండా, ఆ గుర్తింపు ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనం రైతు కుటుంబాలకు చేరేలా వ్యవస్థను బలోపేతం చేయడం కీలకమని తెలిపారు.

అరకు కాఫీ ప్రపంచ కాఫీ మ్యాప్‌పై ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు.. వేలాది మంది గిరిజన రైతుల జీవనోపాధికి మరింత బలమైన పునాది కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.