పేదల సేవలో సంక్షేమ పథకాల కన్వర్జెన్స్‌పై సీఎం చంద్రబాబు..

Amaravati: పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కన్వర్జెన్స్ చేపట్టాలని, పీ4 విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 30 Sept 2026 10:14 PM IST
Amaravati
X

పేదల సేవలో సంక్షేమ పథకాల కన్వర్జెన్స్‌పై సీఎం చంద్రబాబు..

అమరావతి: పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గరిష్ఠ ప్రయోజనం అందేలా పథకాల కన్వర్జెన్స్‌ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పేదల సేవలో సంక్షేమ కార్యక్రమాల కన్వర్జెన్స్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్న జూమ్‌ కాన్ఫరెన్స్‌లో సీఎం పలు సూచనలు చేశారు.

రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి నాలుగు నుంచి ఐదు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని సీఎం తెలిపారు. స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం వంటి పథకాలతో పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. ఇప్పటికే పీ4 కార్యక్రమం కింద 11 లక్షల మంది బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు చేయూత అందిస్తున్నారని చెప్పారు. పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గేలా సంక్షేమంతో పాటు పీ4 కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు.

పీ4 మోడల్‌ రాష్ట్రంలో అమలవుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని చంద్రబాబు అన్నారు. సోషల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ తరహా వ్యవస్థ ద్వారా పీ4 కార్యక్రమాలను పర్యవేక్షించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతల తగ్గింపు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గాన్ని పేదరికం, ఆర్థిక అసమానతలు లేని దిశగా అభివృద్ధి చేయాలని అన్నారు.

ప్రజలకు పౌర సేవలను మరింత సమర్థంగా అందించేందుకు టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ సేవలు సులభంగా అందితే ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు కెపాసిటీ బిల్డింగ్‌ శిక్షణ అవసరమని పేర్కొన్నారు. ఐఐటీలు, ఐఐఎంల వంటి సంస్థల ద్వారా ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

కలెక్టర్లు, నోడల్‌ అధికారులు నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. రాజకీయ పాలనకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే నియోజకవర్గ స్థాయిలో విజన్‌ యూనిట్లను బలోపేతం చేయాలని చెప్పారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రం నుంచి గ్రామస్థాయి వరకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

మహిళల ఆర్థిక సాధికారతపై కూడా సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వయం బ్రాండ్‌ ద్వారా డ్వాక్రా మహిళల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తున్నామని, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పల్లె పండుగ-3.0 ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు సమకూరుతున్నాయని, అభివృద్ధి పనులు పారదర్శకంగా, నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి ఏడాది అక్టోబర్‌ 2న స్వచ్ఛాంధ్ర అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీఎం తెలిపారు. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయుల్లో వివిధ కేటగిరీల్లో అవార్డులు అందిస్తామని చెప్పారు. ద్రవ్యోల్బణ భారం ప్రజలపై పడకుండా అన్ని స్థాయిల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, రైతు బజార్లలో తక్కువ ధరకు ఉల్లి అందించే చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేయాలని చంద్రబాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా నిలపడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.