Undavalli: అంధ క్రికెటర్లకు అండగా నిలుస్తాం.. మంత్రి నారా లోకేష్!

Undavalli: ఉండవల్లిలో మంత్రినారా లోకేష్‌ను కలిసిన భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి. ఏపీలో అంధుల క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 28 Sept 2026 4:36 PM IST
Undavalli
X

Undavalli: అంధ క్రికెటర్లకు అండగా నిలుస్తాం.. మంత్రి నారా లోకేష్!

Undavalli: భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అంధుల క్రికెట్ అభివృద్ధి, క్రీడాకారులకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

అజయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భారత అంధుల క్రికెట్ జట్టు మూడు సార్లు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన అంధ క్రికెటర్లకు తగిన ప్రోత్సాహం, గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు.

ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు అంధ క్రికెటర్లు గతంలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారని అజయ్ కుమార్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రం తరఫున జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా మరింత మంది యువత అంధుల క్రికెట్ వైపు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు.

అదేవిధంగా రాష్ట్రంలో అంధ క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి లోకేష్‌ను కోరారు. ప్రస్తుతం సాధారణ మైదానాల్లో శిక్షణ పొందాల్సి వస్తుండటంతో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ప్రత్యేక మైదానం అందుబాటులోకి వస్తే శిక్షణ, పోటీలు నిర్వహించడంతో పాటు రాష్ట్రం నుంచి మరింత మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను జాతీయ స్థాయికి తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని తెలిపారు.

అజయ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తులపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. అంధ క్రికెటర్ల సమస్యలపై వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటానని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, మద్దతు అందించేందుకు ప్రభుత్వం తరఫున సాధ్యమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంధ క్రికెటర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

అంధుల క్రికెట్‌లో ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారికి మెరుగైన శిక్షణ, క్రీడా సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో అజయ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ అంధుల క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జీ. రవీంద్రబాబు పాల్గొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.