Gudihathnoor: గుడిహత్నూర్‌లో బుడిమ పండ్ల విక్రయం.. ప్రయాణికుల ఆసక్తి
Gudihathnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం చింతగూడ హైవేపై గిరిజన మహిళలు అమ్ముతున్న ప్రకృతి ప్రసాదం బుడిమ పండ్లు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Gudihathnoor: గుడిహత్నూర్‌లో బుడిమ పండ్ల విక్రయం.. ప్రయాణికుల ఆసక్తి
గుడిహత్నూర్: మండలంలోని చింతగూడ జాతీయ రహదారి పక్కన గిరిజన మహిళలు బుడిమ పండ్లను విక్రయిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. ఏటా వర్షాకాలం ముగింపు దశలో కేవలం నెల రోజుల పాటు మాత్రమే లభించే ఈ అరుదైన బుడిమ పండ్లను సేకరించేందుకు గిరిజన మహిళలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని చేలల్లో, పొలం గట్ల వెంట సహజసిద్ధంగా మొలిచే తీగల నుంచి వీటిని జాగ్రత్తగా తెంపి తెచ్చి రహదారి వెంట చిన్నపాటి కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. రోజంతా ఎండనక, వాననక కష్టపడి అమ్మితే రోజుకు ₹300 నుంచి ₹500 వరకు ఆదాయం సమకూరుతుందని, ఈ సీజన్‌లో ఇది తమ కుటుంబాలకు చేదోడువాదోడుగా నిలుస్తోందని మహిళలు పేర్కొంటున్నారు.
ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు వాడకుండా సహజ సిద్ధంగా, సేంద్రీయ పద్ధతిలో లభించే ఈ బుడిమ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని స్థానికులు, కొనుగోలుదారులు చెబుతున్నారు. శరీరానికి చలువ చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఈ పండ్లు ఔషధంలా పనిచేస్తాయని భావిస్తారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు, బాటసారులు ప్రత్యేకంగా వాహనాలు ఆపి మరీ వీటిని ఆసక్తిగా కొనుగోలు చేసి తీసుకెళ్తుండటంతో రహదారి వెంబడి సందడి వాతావరణం నెలకొంది.
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ప్రవాసులు
ఇంద్రవెల్లి మండలానికి చెందిన వందన, సంగప్రియ అనే మహిళలు కొన్ని సంవత్సరాల క్రితమే ఆఫ్రికా దేశంలో స్థిరపడ్డారు. ఇటీవల స్వదేశానికి వచ్చిన వీరు తమ బంధువులను కలిసేందుకు ఆదిలాబాద్ వెళ్తుండగా, చింతగూడ వద్ద రహదారి పక్కన గిరిజన మహిళలు అమ్ముతున్న బుడిమ పండ్లను చూసి ఆగి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
చిన్నతనంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా ఈ బుడిమ పండ్లను ఎంతో ఇష్టంగా తినేవారమని, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. తాము ఆఫ్రికా దేశంలో స్థిరపడటం వల్ల చాలా ఏండ్ల తర్వాత మళ్లీ ఈ బుడిమ పండ్లను చూడటం, కొనుగోలు చేయడం ఎంతో సంతోషాన్ని, అనుభూతిని ఇచ్చిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.
అయితే అంతరించిపోతున్న నాటు రుచులను, సంప్రదాయ అటవీ ఉత్పత్తులను నేటి తరానికి పరిచయం చేస్తూ గిరిజన మహిళలు ఉపాధి పొందుతుండటం విశేషం




