Nirmal: వంతెన లేక.. కడెం వాగు దాటేందుకు నాటు తెప్పలే గతి!

Nirmal: నిర్మల్ జిల్లా పెంబి మండలంలో దసరా వేళ గిరిజన గ్రామాల ప్రజల తిప్పలు. వంతెన లేకపోవడంతో కడెం వాగు దాటేందుకు నాటు తెప్పలపై ప్రాణాలకు తెగించి ప్రయాణం.

RAKESH N, KHANAPUR
Published on: 11 Oct 2026 11:17 AM IST
Nirmal
X

Nirmal: వంతెన లేక.. కడెం వాగు దాటేందుకు నాటు తెప్పలే గతి!

Nirmal: దసరా పండుగ వేళ నిర్మల్ జిల్లాలో గిరిజన గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పెంబి మండల పరిధిలోని మారుమూల గ్రామాల ప్రజలకు పండుగ పూట తెప్ప ప్రయాణం తప్పడం లేదు. కడెం వాగు దాటడానికి సరైన వంతెన లేకపోవడంతో.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నాటు తెప్పలపై ప్రయాణిస్తున్నారు. పండుగ సరుకుల కోసం ఒకేసారి భారీగా జనాలు తరలిరావడంతో తెప్పలపై మోయలేని భారం పడుతోంది.

నాటు తెప్పపై తప్పని తిప్పలు

తెలంగాణ ప్రజల పెద్ద పండుగ దసరా వచ్చింది. ప్రతి ఇల్లూ బంధువులు, వేడుకలతో కళకళలాడుతోంది. కానీ, నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని యాపలగూడ, రాంనగర్, దొందారి, వస్పెలి గ్రామాల్లో మాత్రం పండుగ పూట భయాందోళనలు నెలకొన్నాయి. ఈ మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే కడెం దొంతు వాగును దాటడం మినహా మరో మార్గం లేదు. వాగుపై వంతెన లేకపోవడంతో దశాబ్దాలుగా ఈ గ్రామస్తులు నాటు తెప్పలపైనే ఆధారపడుతున్నారు.

దసరా పండుగ కావడంతో పట్టణాలు, ఇతర ఊర్ల నుంచి స్వగ్రామాలకు వచ్చే ప్రజల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. పండుగ సరుకులు, నిత్యావసర వస్తువులతో పాటు తమ ద్విచక్ర వాహనాలను సైతం గ్రామస్తులు ఈ చిన్నపాటి నాటు తెప్పలపైనే ఎక్కించి వాగు దాటిస్తున్నారు. సామర్థ్యానికి మించి జనాలు, బరువులు తెప్పలపైకి చేరడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చిన్న ప్రమాదం జరిగినా భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR