Nirmal: గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు..కలెక్టర్ భవేశ్ మిశ్రా!
Nirmal: గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని, పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
Nirmal: గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు..కలెక్టర్ భవేశ్ మిశ్రా!
Nirmal: రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు, భద్రతాపరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
శనివారం సాయంత్రం హైదరాబాద్ నుండి రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు పలు జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తు ప్రణాళికతో చేపట్టాలని సూచించారు. నూతన పుష్కర ఘాట్ల నిర్మాణం, పాత ఘాట్ల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.
భక్తులకు సురక్షిత తాగునీరు అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నిర్మాణ పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పుష్కర ప్రాంతాల్లో ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో చేపడుతున్న పనులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనుల పురోగతిపై నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు.
అన్ని పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేసేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. భక్తులకు సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలంకరణతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌ఛార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల ఈఈలు అనిల్, సందీప్, తుకారాం, సీపీఓ గంగారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి రమణ, డీవైఎస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




