Nirmal: సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయండి: ఎస్పీ!
Nirmal: లక్ష్మణచాంద మండలం చామన్‌పల్లిలో ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాలను నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించి, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
Nirmal: సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయండి: ఎస్పీ!
Nirmal: లక్ష్మణచాంద మండలంలోని చామన్‌పల్లి గ్రామ పంచాయతీ భవనంలో గ్రామ ప్రజల భాగస్వామ్యంతో సుమారు రూ.1.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాలు, మానిటర్‌తో కూడిన నిఘా వ్యవస్థను నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మీ సుదర్శన్, ఉపసర్పంచ్ గంగారెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజలు జిల్లా ఎస్పీకి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు గ్రామ భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వీధులు, రహదారులను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు దొంగతనాలు, వాహనాల చోరీలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ఇవి ఉపయోగపడతాయని వివరించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను గుర్తించడంతో పాటు నేరాలు జరిగినప్పుడు సీసీ కెమెరాల దృశ్యాలు నిందితులను గుర్తించి దర్యాప్తును వేగవంతం చేయడానికి కీలక ఆధారాలుగా నిలుస్తాయని తెలిపారు.
అనంతరం గ్రామ ప్రజలకు సైబర్ నేరాలపై ఎస్పీ అవగాహన కల్పించారు. ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు అడిగి చేసే ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియాలో ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం, వీడియో కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడటం, వృద్ధులకు పెన్షన్ ఇప్పిస్తామంటూ చేసే మోసాల గురించి ఉదాహరణలతో వివరించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని, అత్యవసర పోలీస్ సహాయం కోసం 112కు కాల్ చేయాలని తెలిపారు.
అదేవిధంగా గంజాయి, మత్తు పదార్థాలు, కల్తీ కల్లు వంటి వాటికి అలవాటు పడటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబ మరియు భవిష్యత్తుపై పడే దుష్ప్రభావాలను వివరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసైన వారికి చికిత్స అందించేందుకు పునరావాస కేంద్రం అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొని, తమ పిల్లలను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉంటూ, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ప్రొవిజనల్ డీఎస్పీలు గజారే సంగీత, చట్టు భవాని, సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐలు శ్రావణి, గోపి, చామన్‌పల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మీ సుదర్శన్, ఉపసర్పంచ్ గంగారెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




