Nirmal: అడెల్లి మహాపోచమ్మ జాతరకు 250 మంది పోలీసులతో బందోబస్తు!

Nirmal: దిలావర్‌పూర్ మండలం సాంగ్వి గోదావరి నది వద్ద జరిగే అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతరకు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విధులపై సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల దిశానిర్దేశం చేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 17 Oct 2026 12:14 PM IST
Nirmal
X

Nirmal: అడెల్లి మహాపోచమ్మ జాతరకు 250 మంది పోలీసులతో బందోబస్తు!

నిర్మల్: నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్ మండలం సాంగ్వి గ్రామ సమీపంలోని గోదావరి నది వద్ద నిర్వహించనున్న అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర సందర్భంగా 250 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బందోబస్తు విధులకు కేటాయించిన పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల బ్రీఫింగ్ సమావేశం నిర్వహించి, విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, గోదావరి నది పరిసరాల్లో భద్రత, అవాంఛనీయ ఘటనల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో విధులు నిర్వహించాలని, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు తక్షణమే స్పందించాలని సూచించారు. గోదావరి నదిలో స్నానం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకూడదని, పోలీసు సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో తోపులాటకు పాల్పడకుండా క్రమపద్ధతిలో ముందుకు సాగాలని, పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపి, ట్రాఫిక్‌కు అంతరాయం కరిగించకూడదన్నారు. మద్యం సేవించి నదిలోకి దిగకూడదని, నీటి లోతు తెలియని ప్రాంతాల్లోకి వెళ్లరాదన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నగలు, నగదు, మొబైల్ ఫోన్లు వంటి విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలన్నారు. అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతరను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్‌తో పాటు సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL