Nirmal: ఎస్పీ జానకీ షర్మిల కీలక సూచనలు.. కేసుల త్వరిత పరిష్కారానికి ఆదేశం!

Nirmal: నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల సీడీఓలు, టెక్ టీమ్ రైటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 10 Oct 2026 3:14 PM IST
Nirmal
X

Nirmal: ఎస్పీ జానకీ షర్మిల కీలక సూచనలు.. కేసుల త్వరిత పరిష్కారానికి ఆదేశం!

Nirmal: రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఆదేశాల మేరకు జిల్లాలో సమర్థవంతంగా చట్టాలు అమలు చేయడంపై నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించడం, నాణ్యమైన దర్యాప్తు చేపట్టడం, కోర్టు విచారణలను వేగవంతం చేయడం, నేరాల్లో దోషులకు శిక్షలు పడేలా సమన్వయంతో పనిచేయడంపై పలు సూచనలు చేశారు.

ప్రతి కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి చార్జిషీట్ దాఖలు వరకు దర్యాప్తును నాణ్యతతో పూర్తి చేయాలి. కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించి, కోర్టులో సమర్థవంతంగా ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలి. దర్యాప్తులో నిర్లక్ష్యం, జాప్యం లేకుండా ప్రతి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి. విచారణ ప్రారంభం కాని కేసుల ట్రయల్స్ త్వరగా మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలి. PT కేసులు, పెండింగ్‌లో ఉన్న ఈ-సమ్మన్లు, చిన్నచిన్న కేసులు, మద్యం సేవించి వాహనాలు నడిపిన (D&D) కేసులను త్వరగా పరిష్కరించాలి. దర్యాప్తు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ నేరస్తులకు శిక్షలు పడే శాతం పెంచేందుకు కృషి చేయాలి.

కేసులు, కోర్టు విచారణలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో, CCTNSలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. కోర్టు ప్రక్రియల్లో అవసరమైన CC నంబర్లను త్వరగా పొందేలా చర్యలు చేపట్టాలి. ప్రతి కేసులో బాధితులకు సత్వర న్యాయం అందేలా అధికారులు చొరవ తీసుకోవాలి.

నేరాల నియంత్రణ, నాణ్యమైన దర్యాప్తు, కేసుల త్వరిత పరిష్కారం, ప్రజల భద్రత విషయంలో ప్రతి పోలీసు అధికారి బాధ్యతతో పనిచేయాలి. పోలీసులు సాధించిన విజయాలు, చేపట్టిన మంచి పనులను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీసు శాఖపై నమ్మకాన్ని మరింత పెంచాలని ఎస్పీ సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, IPS, నిర్మల్ డీఎస్పీ పి. శ్రీనివాస్, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌ఓలు, సీసీటీఎన్‌ఎస్ రైటర్లు, టెక్ టీమ్, సీడీఓలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL