Sirikonda: రాయిగూడ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడికి గ్రాండ్ ఫేర్‌వెల్!
Sirikonda: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయిగూడ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు నైతం ప్రభాకర్ రావుకు అపూర్వ వీడ్కోలు. ఎడ్లబండిపై ఊరేగించిన గ్రామస్తులు.
Sirikonda: రాయిగూడ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడికి గ్రాండ్ ఫేర్‌వెల్!
Sirikonda: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రాయిగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించి, అక్టోబరు 31న పదవీ విరమణ పొందిన నైతం ప్రభాకర్ రావుకు గ్రామస్తులు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి అపూర్వమైన రీతిలో వీడ్కోలు పలికారు.
నిన్న నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో, సాంప్రదాయ తలపాగా ధరించిన ప్రభాకర్ రావును ఆయన సతీమణితో కలిసి రంగురంగుల వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండిపై నిలబెట్టి ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళాలు, బాజాభజంత్రీల నడుమ విద్యార్థులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గ్రామంలోని వీధుల గుండా ఉత్సాహంగా ఊరేగింపు నిర్వహించారు.
ఊరేగింపు పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న సమయంలో గ్రామస్తులు, మహిళలు ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటూ తమ గౌరవాన్ని, కృతజ్ఞతను చాటుకున్నారు. అనంతరం ఆ దంపతులు పాఠశాల ఆవరణలోని సరస్వతీ దేవి విగ్రహం వద్ద పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. సుదీర్ఘకాలం విద్యార్థుల భవిష్యత్తు కోసం నిస్వార్థంగా శ్రమించిన గురువును ఘనంగా సత్కరిస్తూ గ్రామస్తులు చాటుకున్న ఈ ఆత్మీయ అనుబంధం అందరినీ ఆకట్టుకుంది.




