Sirikonda: గిరిజనుల సాంప్రదాయ ఆహార వ్యవస్థను పరిరక్షించాలి

Sirikonda: సిరికొండలో 'ఆదివాసీ ఆహార వైభవం' కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. గిరిజన సాంప్రదాయ వంటకాలు, దేశీ విత్తనాల ప్రదర్శన పరిశీలన.

NAGULA SATISH, BOATH
Published on: 16 Sept 2026 10:26 PM IST
Sirikonda
X

Sirikonda: గిరిజనుల సాంప్రదాయ ఆహార వ్యవస్థను పరిరక్షించాలి

సిరికొండ: కనుమరుగవుతున్న గిరిజనుల స్వచ్ఛమైన సాంప్రదాయ ఆహార వ్యవస్థ, దేశీ విత్తనాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. బుధవారం ఆర్పీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరికొండ మండలం నారాయణపూర్ గ్రామంలో నిర్వహించిన 'ఆదివాసీ ఆహార వైభవం' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా గ్రామంలో గిరిజన మహిళలు స్వయంగా తయారుచేసిన 60 రకాల సంప్రదాయ వంటకాలు, రైతులు సేకరించిన 30 రకాల దేశీ విత్తనాలు, 10 సహజ సేంద్రీయ కషాయాల స్టాళ్లను కలెక్టర్ పరిశీలించి వారి నైపుణ్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సహజ సిద్ధ వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన 'బయో రిసోర్స్ సెంటర్'ను ప్రారంభించడంతో పాటు రైతులకు పండ్ల, వెదురు మరియు మునగ మొక్కలను పంపిణీ చేశారు.

​కార్యక్రమంలో ఆదివాసీ గ్రామ ముఖ్య పటేల్ సుంగు పటేల్ మాట్లాడుతూ, ఆర్పీజీ ఫౌండేషన్ గ్రామంలో కలిసి పనిచేస్తూ సాంప్రదాయ విజ్ఞానాన్ని వెలికితీస్తోందని, గిరిజనులు తయారుచేసే చిరుధాన్యాలు, ఉత్పత్తులకు జిల్లా కేంద్రంలో సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే యువత వలసలు పోకుండా వ్యవసాయంపై ఆధారపడుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మిల్కా, ఉద్యానవన శాఖ డైరెక్టర్ సందీప్ కుమార్, వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీధర్ చౌహాన్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రాజశేఖర్, వ్యవసాయ అధికారి శ్రద్ధా రాణి, అటవీ శాఖ డివిజన్ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు, 40 గ్రామాల ఆదివాసీ ముఖ్య పటేళ్లు మరియు సుమారు 500 మంది గిరిజన రైతులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH