Hyderabad: నష్టాల నుంచి లాభాల బాటలో ఏపీహెచ్‌ఎంఈఎల్: సింగరేణి అండ
Hyderabad: సింగరేణి నిర్వహణతో ఏపీహెచ్‌ఎంఈఎల్ నష్టాల నుంచి గట్టెక్కి గత మూడేళ్లలో రూ.34.20 కోట్ల రికార్డు నికర లాభాలను ఆర్జించింది.
Hyderabad: నష్టాల నుంచి లాభాల బాటలో ఏపీహెచ్‌ఎంఈఎల్: సింగరేణి అండ
హైదరాబాద్: ఒకప్పుడు రూ.21 కోట్ల నష్టాలతో మూసివేత అంచులకు చేరిన ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఏపీఎచ్‌ఎంఈఎల్) ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోంది. సింగరేణి ఆధీనంలోకి వచ్చిన అనంతరం సంస్థ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. 2023-24 నుంచి 2025-26 వరకు వరుసగా లాభాలను నమోదు చేస్తూ ముందుకు సాగుతోంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 కోట్ల నికర లాభం సాధించిన సంస్థ.. 2024-25లో రూ.9.87 కోట్లు, 2025-26లో రికార్డు స్థాయిలో రూ.23.33 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దీంతో గత మూడేళ్లలోనే సంస్థ నికర లాభాలు రూ.34.20 కోట్లకు చేరాయి. 1998-99లో సింగరేణి ఆధీనంలోకి వచ్చిన తర్వాత 2025-26 వరకు మొత్తం సంచిత లాభాలు రూ.60.85 కోట్లుగా నమోదయ్యాయి.
సింగరేణి అండతో మారిన పరిస్థితి.
1976లో విజయవాడ సమీపంలోని కొండపల్లిలో 209 ఎకరాల్లో ఏపీఎచ్‌ఎంఈఎల్‌ను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఆశించిన స్థాయిలో ఆర్డర్లు రాకపోవడం, అవసరానికి మించి సిబ్బంది ఉండటం తదితర కారణాలతో సంస్థ తీవ్ర నష్టాల్లోకి వెళ్లింది. 1997-98 నాటికి రూ.21 కోట్ల నికర నష్టాలను చవిచూసింది. చివరకు 2002లో సంస్థ మూసివేతకు సంబంధించిన పరిస్థితి ఏర్పడింది.
ఈ సమయంలో సింగరేణి సంస్థకు అండగా నిలిచింది. 1994 నుంచే సింగరేణికి అవసరమైన యంత్రాలు, విడిభాగాలకు ఏపీఎచ్‌ఎంఈఎల్‌కు ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించింది. అనంతరం సంస్థలో పెట్టుబడులు పెట్టి నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. మొత్తం రూ.14.08 కోట్ల పెట్టుబడితో 81.54 శాతం వాటాను సింగరేణి కలిగి ప్రధాన భాగస్వామిగా మారింది.
జాతీయ స్థాయిలో విస్తరణ.
ప్రస్తుతం సింగరేణితో పాటు బీహెచ్‌ఈఎల్, జెన్‌కో, ఎన్‌ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్ వంటి ప్రముఖ సంస్థలకు యంత్రాలు, యంత్ర విడిభాగాలను ఏపీఎచ్‌ఎంఈఎల్ సరఫరా చేస్తోంది. కొత్త ఆర్డర్లు సాధించడం, ఉత్పత్తుల్లో వైవిధ్యం తీసుకురావడం, వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా సంస్థను జాతీయ స్థాయిలో పోటీపడే సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో ఏపీఎచ్‌ఎంఈఎల్ విస్తరణకు చర్యలు చేపట్టినట్లు సింగరేణి తెలిపింది. గత ఏడాది ఆగస్టులో భట్టి విక్రమార్క ప్లాంట్‌ను సందర్శించి సంస్థ పనితీరు, అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు.
విద్యుత్ ఖర్చు తగ్గించేందుకు సోలార్ ప్లాంట్
వ్యయ నియంత్రణలో భాగంగా ఏపీఎచ్‌ఎంఈఎల్ ప్లాంట్ ప్రాంగణంలో 300 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సుమారు రూ.1.24 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ అవసరాలకు ఏటా సుమారు రూ.60 లక్షలు ఖర్చవుతుండగా.. సోలార్ ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 1,200 కిలోవాట్ అవర్‌ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. దీంతో నెలకు సుమారు రూ.2 లక్షల వరకు విద్యుత్ ఖర్చు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నష్టాల నుంచి లాభాల బాటలోకి వచ్చిన ఏపీఎచ్‌ఎంఈఎల్‌ను భవిష్యత్‌లో జాతీయ స్థాయి భారీ ఇంజినీరింగ్ సంస్థగా తీర్చిదిద్దేందుకు మరింత విస్తరణ చర్యలు చేపడుతున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు.




