Nirmal: నిర్మల్ శివాజీ చౌక్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన డ్రైవర్!
Nirmal: నిర్మల్ శివాజీ చౌక్‌లోని 5 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను ఆర్టీసీ డ్రైవర్ రాజు ఆదివారం సమయస్ఫూర్తితో కాపాడాడు.
Nirmal: నిర్మల్ శివాజీ చౌక్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన డ్రైవర్!
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో మరోసారి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించిన ఓ మహిళను ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తితో కాపాడాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి ఆదివారం సాయంత్రం శివాజీ చౌక్‌లోని నిర్మాణంలో ఉన్న భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆర్టీసీ డ్రైవర్ రాజు చాకచక్యంగా భవనంపైకి వెళ్లి మహిళను ప్రమాదకర ప్రాంతం నుంచి పక్కకు తీసుకొచ్చి కాపాడాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని మహిళను ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలపై ఆరా తీశారు.
గతంలోనూ ఇదే భవనంపై మరో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో తాజా ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సమయస్ఫూర్తితో మహిళ ప్రాణాలను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్ రాజును స్థానికులు అభినందించారు.




