Basara: ఆర్జీయూకేటీలో సీఎం మాస్క్‌తో కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన!
Basara: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన ఎనిమిదో రోజుకు చేరుకుంది.
Basara: ఆర్జీయూకేటీలో సీఎం మాస్క్‌తో కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన!
Basara: ఆర్జీయూకేటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు చేపట్టిన ఆందోళన ఎనిమిదో రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా అధ్యాపకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్కులు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, గత 18 సంవత్సరాలుగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా సేవలందిస్తున్న వారిని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ సర్వీసులోకి అబ్జార్బ్ చేసిన తర్వాతే కొత్త ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్జీయూకేటీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని వివిధ రంగాల్లో స్థిరపడుతున్నప్పటికీ, వారికి విద్యాబోధన చేస్తున్న అధ్యాపకులమైన మేము మాత్రం గత 18 సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగోన్నతి లేకుండా యథాస్థితిలోనే కొనసాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న అధ్యాపకుల భవిష్యత్తుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా విద్యారంగానికి విశేష సేవలందిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగులకు ఏడవ పీఆర్సీని తక్షణమే అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పావని, డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ విజయకుమార్, సతీష్ కుమార్, చరణ్ రెడ్డి, శ్రీకాంత్, హరికృష్ణ, డాక్టర్ పసునూరి శ్రీనివాస్, రమాకాంత్, ఏ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




