Nirmal: ఆదిలాబాద్-నిర్మల్-ఆర్మూర్ రైల్వే రీ-సర్వేను త్వరగా ఖరారు చేయాలి!

Nirmal: ఆదిలాబాద్-నిర్మల్-ఆర్మూర్ రైల్వే లైన్ రీ-సర్వేను ఖరారు చేసి కేంద్రానికి సిఫార్సు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంను రైల్వే లైన్ సాధన సమితి అధ్యక్షుడు నంగె శ్రీనివాస్ కోరారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 27 Oct 2026 1:41 PM IST
Nirmal
X

Nirmal: ఆదిలాబాద్-నిర్మల్-ఆర్మూర్ రైల్వే రీ-సర్వేను త్వరగా ఖరారు చేయాలి!

Nirmal: ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ నూతన రైల్వే లైన్ రీ–సర్వే నివేదికను తుది సాంకేతిక పరిశీలన అనంతరం ఖరారు చేసి, ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) ప్రక్రియను వేగవంతం చేయాలని రైల్వే లైన్ సాధన సమితి అధ్యక్షుడు నంగె శ్రీనివాస్ కోరారు. సోమవారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో జనరల్ మేనేజర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రాజెక్టు ఆమోదం, నిధుల కేటాయింపుల కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు, రైల్వే బోర్డుకు సానుకూల సిఫార్సులు పంపాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో జాతీయ రహదారి వెంట ప్రతిపాదించిన మార్గంలో భారీ నిర్మాణ వ్యయం, క్లిష్టమైన ఘాట్ ప్రాంతాలు, సొరంగాలు, వంతెనల కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగలేకపోయిందని వివరించారు. ప్రత్యామ్నాయ మార్గం ద్వారా గతంలో సుమారు రూ.4,500 కోట్లుగా అంచనా వేసిన వ్యయాన్ని రూ.2,800 కోట్ల స్థాయికి తగ్గించే అవకాశాలను సాంకేతికంగా పరిశీలించాలని కోరారు.

ఆదిలాబాద్ నుంచి బరంపూర్, బజార్‌హత్నూర్, సొనాల, కౌఠ, కన్గుట్ట, పొచ్చెర, కుచులాపూర్, ధన్నూర్ ప్రాంతాలను కలుపుతూ, అడెల్లి పోచమ్మ పుణ్యక్షేత్రానికి సమీపంగా నిర్మల్ మీదుగా ఆర్మూర్‌కు రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యంతోపాటు వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి, పర్యాటక రంగాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

ఆర్మూర్ మార్గాన్ని నిజామాబాద్ బైపాస్ సమీపంలోని హైదరాబాద్ రైల్వే లైన్‌తో అనుసంధానిస్తే నిజామాబాద్ స్టేషన్‌కు వెళ్లి తిరిగి ప్రయాణ దిశ మార్చుకోవాల్సిన అవసరం తగ్గి, ప్రయాణ సమయం ఆదా కావచ్చని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు కేవలం ప్రాంతీయ రవాణా అవసరాలకే పరిమితం కాదని, భవిష్యత్తులో ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య వ్యూహాత్మక ప్రత్యామ్నాయ రైల్వే అనుసంధానంగా అభివృద్ధి చెందగలదని నంగె శ్రీనివాస్ తెలిపారు. ప్రయాణికుల, సరుకు రవాణా అవకాశాలతోపాటు దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో సెమీ హైస్పీడ్ రైళ్లకు అనువైన మౌలిక సదుపాయాల సాధ్యతను కూడా అధ్యయనం చేయాలన్నారు.

మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న రైల్వే కలను సాకారం చేసేందుకు రీ–సర్వేను ఖరారు చేసి, FLS ప్రక్రియను పూర్తి చేయాలి. కేంద్రానికి సానుకూల సిఫార్సులు పంపి, ప్రాజెక్టు ఆమోదం, నిధుల కేటాయింపులకు చొరవ చూపాలని నంగె శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL