Kadem: పెద్దూర్‌లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్!

Kadem: కడెం మండలం పెద్దూర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. వాటర్ హీటర్‌తో తాళం కాల్చి దొంగతనానికి పాల్పడ్డ నిందితుడి అరెస్ట్, బంగారం, వెండి స్వాధీనం.

RAKESH N, KHANAPUR
Updated on: 11 Oct 2026 7:30 PM IST
Kadem
X

Kadem: పెద్దూర్‌లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్!

Kadem: నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం పూస గణేష్ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖానాపూర్ సీఐ కట్కం సత్యనారాయణ, కడెం ఎస్‌ఐ పెంధోట సాయి కిరణ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం కడెం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు కేసు వివరాలను వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దూర్ గ్రామానికి చెందిన గుండబోయిన ముత్యాలు, అదే గ్రామానికి చెందిన పూస గణేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని విషయాన్ని గమనించాడు. దీంతో గత గురువారం రాత్రి గణేష్ ఇంటి తాళాన్ని వాటర్ హీటర్‌తో కాల్చి ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం బీరువాలో ఉన్న 36 గ్రాముల బంగారు ఆభరణాలు, 650 గ్రాముల వెండి ఆభరణాలను దొంగిలించాడు.

మరుసటి రోజు చోరీ చేసిన నగలను విక్రయించేందుకు ఖానాపూర్‌లోని నగల దుకాణాలకు వెళ్తున్న సమయంలో పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలోనూ దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి చోరీకి గురైన 36 గ్రాముల బంగారు ఆభరణాలు, 650 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సత్యనారాయణ వెల్లడించారు.

గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని నిఘా వ్యవస్థ బలోపేతానికి పోలీసులకు సహకరించాలని సీఐ, ఎస్‌ఐ కోరారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక కృషి చేసిన హెడ్ కానిస్టేబుల్ జగ్మల్, కానిస్టేబుల్ భీమ్రావు, ఇతర పోలీసు సిబ్బందిని సీఐ అభినందించి ప్రోత్సాహకాన్ని అందజేశారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR