Dasturabad: దస్తురాబాద్ ప్రజావాణిలో వరి ధాన్యం కమిషన్ దుమారం!
Dasturabad: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ ప్రజావాణిలో 2019–2025 వరి ధాన్యం కొనుగోలు కమిషన్ వివరాలు వెల్లడించడం లేదని వివో లీడర్ కొంతం లావణ్య సోమవారం ఫిర్యాదు చేశారు.
Dasturabad: దస్తురాబాద్ ప్రజావాణిలో వరి ధాన్యం కమిషన్ దుమారం!
నిర్మల్ జిల్లా: దస్తురాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో వరి ధాన్యం కొనుగోలు కమిషన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మంజూరు చేసిన కమిషన్ డబ్బుల వివరాలు అధికారులు వెల్లడించడం లేదని ఆరోపిస్తూ ఓ వివో లీడర్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దస్తురాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన శ్రీ మణికంఠ వివో లీడర్ కొంతం లావణ్య అధికారులకు వినతిపత్రం అందజేశారు.
2019 నుండి 2025 వరకు మణికంఠ వివో ఆధ్వర్యంలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రైతుల నుండి వరి ధాన్యాన్ని సేకరించి రైస్ మిల్లులకు పంపించామని ఆమె తెలిపారు. అయితే, ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం అందించిన కమిషన్ వివరాలను సంబంధిత అధికారులు ఇప్పటివరకు తెలియజేయడం లేదని ఆరోపించారు. కమిషన్ మంజూరైందా అని అడిగినా అధికారుల నుండి సరైన సమాధానం రావడం లేదని వాపోయారు. అంతేకాకుండా, కొనుగోలు కేంద్రాల్లో పనిచేసిన వివో లీడర్లకు ఇప్పటికీ కూలీ డబ్బులు చెల్లించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు తక్షణమే స్పందించి 2019-2025 మధ్య కాలంలో వచ్చిన ధాన్యం కమిషన్‌పై సమగ్ర విచారణ జరిపి, ఆ నిధులను వివో గ్రూపుల ఖాతాల్లో జమ చేయాలని కొంతం లావణ్య డిమాండ్ చేశారు.




