Nirmal: ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ భవేష్!
Nirmal: నిర్మల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ భవేష్ మిశ్రా అర్జీలు స్వీకరించారు. అటల్ పెన్షన్ యోజన అమలులో జిల్లాకు ఎక్సలెన్స్ అవార్డు లభించింది.
Nirmal: ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ భవేష్!
నిర్మల్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి, భూ సమస్యలు తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజావాణి లాగిన్లో నమోదైన ప్రతి దరఖాస్తుకు నిబంధనల ప్రకారం సముచిత సమాధానం అందించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలను ప్రత్యేకంగా గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా చర్యలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
అటల్ పెన్షన్ యోజన అమలులో నిర్మల్ జిల్లాకు ఎక్సలెన్స్ అవార్డు
అటల్ పెన్షన్ యోజన (APY) అమలులో 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిర్మల్ జిల్లా 95 శాతం నమోదు లక్ష్యాన్ని సాధించి ఎక్సలెన్స్ అవార్డును దక్కించుకుంది. జిల్లాలో మొత్తం 56,145 మంది ఈ పథకంలో చేరగా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు విశేష కృషి చేశారు.
ఈ నెల 6న హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో పీఎఫ్ఆర్డీఏ సీజీఎం ఆశుతోష్ కుమార్ చేతుల మీదుగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్ అవార్డును అందుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ఈ అవార్డును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఎల్డీఎం రాంగోపాల్ను అభినందించారు. జిల్లాకు ఈ గుర్తింపు రావడానికి కృషి చేసిన బ్యాంకు అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రాథోడ్ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




