Nirmal: సదర్ మాట్ కాలువ చివరి ఆయకట్టుకు నీరందక ఎండిపోతున్న పంటలు!
Nirmal: నిర్మల్ జిల్లా కడం మండలంలో సదర్ మాట్ కాలువ ఆయకట్టుకు నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు పెద్దూర్ తండా రైతులు ఎండిన కుంటలో దిగి వినూత్నంగా నిరసన తెలిపారు
Nirmal: సదర్ మాట్ కాలువ చివరి ఆయకట్టుకు నీరందక ఎండిపోతున్న పంటలు!
Nirmal: నిర్మల్ జిల్లా కడం మండలంలో సాగునీటి గోస మొదలైంది. సదర్ మాట్ కాలువ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో ఆగ్రహించిన పెద్దూర్ తండా రైతులు మంగళవారం ఉదయం ఎండిపోయిన కుంటలో దిగి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. "సాగునీరు అందించండి మహాప్రభో" అంటూ అధికారులకు తమ ఆవేదనను విన్నవించుకున్నారు.
కడం మండలంలోని సదర్ మాట్ కాలువ పరిధిలో చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు చేరడం లేదు. కళ్లెదుటే పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సకాలంలో నీరందకపోతే పెట్టుబడులు సైతం దక్కవని, అప్పులపాలు కావాల్సి వస్తుందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువ చివరి భూములకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సదర్ మాట్ కాలువ సాధన సమితి అధ్యక్షుడు రాజేందర్ హపావత్ మాట్లాడుతూ.. చివరి ఆయకట్టు రైతుల సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. నీరు అందక పంటలు ఎండిపోతే రైతులు కోలుకోలేరని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తమకు కావాల్సింది ఒకటేనని—చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి, తమ పంటలను కాపాడాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు నేతలతో పాటు లావుడ్య గంగన్న, గుగ్లావత్ రాంధన్, భుక్య శేఖర్, వేణు, సుధాకర్, దేవేంధర్, నరేంధర్, అనిల్, నవీన్, బాపురావ్, వెంకటేష్ తదితర రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




