Nirmal: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం వద్దు
Nirmal: నిర్మల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు ఆదేశించారు.
Nirmal: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం వద్దు
నిర్మల్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవరావు తో కలిసి ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను సమర్పించారు. అదేవిధంగా కలెక్టరేట్లో పిల్లల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి ఏర్పాటు చేశారు. ఈ పిల్లల ప్రజావాణికి పలువురు తమ వినతులు సమర్పించారు.
ఐదేళ్ల వయసులోనే ఏకకాలంలో రెండు చేతులతో రాసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ఘనత సాధించిన చిన్నారిని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవరావు అభినందించారు.
నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన నాళం శ్రవణ్ కుమార్, గౌతమి దంపతుల కూతురు నిద్యాన ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ఘనత సాధించింది. అదనపు కలెక్టర్ చిన్నారిని అభినందించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారిని భవిష్యత్తులో మరింత ప్రోత్సహించాలని చెప్పారు. ఈ ప్రజావాణి లో డిఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




