Nirmal: ఖానాపూర్ - మెట్పల్లి రహదారి ప్రమాదాలకు నిలయం.!

Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్-మెట్పల్లి రహదారిపై పిచ్చి మొక్కలు పెరిగి మూలమలుపుల వద్ద రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు

RAKESH N, KHANAPUR
Published on: 1 Oct 2026 9:14 AM IST
Nirmal
X

Nirmal: ఖానాపూర్ - మెట్పల్లి రహదారి ప్రమాదాలకు నిలయం.!

Nirmal: ఖానాపూర్–మెట్పల్లి ప్రధాన రహదారిపై సుర్జాపూర్, బదనకుర్తి వరకు రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మూలమలుపుల వద్ద రహదారి సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే ఈ రహదారిపై పలు వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కన పెరిగిన పిచ్చి మొక్కల కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు సైతం స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదం ఎప్పుడు జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

కనీసం గ్రామం పేరుతో ఏర్పాటు చేసిన బోర్డు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. పిచ్చి మొక్కలు బోర్డులను పూర్తిగా కప్పేయడంతో ప్రయాణికులకు గ్రామాల పేర్లు కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఈ రహదారిపై నిత్యం వాహనాల రాకపోకలతో పాటు పాదచారులు, ఎడ్ల బండ్లు కూడా ప్రయాణిస్తుంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన మొక్కలు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, మూలమలుపుల వద్ద రహదారి స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాదచారులు, ఎడ్ల బండ్లు, ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అధికారులు స్పందించని పక్షంలో ప్రజల భద్రత కోసం తామే స్వచ్ఛందంగా పిచ్చి మొక్కలను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR