Nirmal: కడెం అడవుల్లో టేకు కలప స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు!
Nirmal: కడెం అడవుల్లో టేకు చెట్ల అక్రమ నరికివేత గుట్టురట్టు: ఒకరి అరెస్ట్, రవాణాకు వాడిన ఇనోవా కారు జప్తు. నిందితులపై కేసు నమోదు చేసిన ఎఫ్‌ఆర్‌ఓ గంటల శ్రీనివాస్ రెడ్డి.
Nirmal: కడెం అడవుల్లో టేకు కలప స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు!
నిర్మల్: నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ రేంజ్ పరిధిలోని దోస్త్ నగర్ బీట్ (ఈస్ట్) అడవిలో గత జూన్ 30వ తేదీ రాత్రి కొందరు దుండగులు ఐదు టేకు చెట్లను అక్రమంగా నరికేశారు. మరుసటి రోజు గస్తీ తిరుగుతున్న అటవీ సిబ్బంది ఈ అక్రమ నరికివేతను గుర్తించి UDOR కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో భాగంగా కల్లెడ గ్రామానికి చెందిన కస్తూరి నరసింలు అలియాస్ స్వామిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు దందా వెలుగులోకి వచ్చింది. కల్లెడకు చెందిన మేడిశెట్టి మహేష్, రెండ్లగూడ మందపల్లికి చెందిన బనావత్ సంజు నాయక్ లతో కలిసి తాను అడవిలో టేకు చెట్లను నరికినట్లు నరసింలు అంగీకరించాడు.
ఆ కలప దుంగలను ఇనోవా కారులో తరలించి, జగిత్యాల జిల్లా రాయపట్నం గ్రామంలో దాచిపెట్టినట్లు వాంగ్మూలం ఇచ్చాడు.దీంతో రంగంలోకి దిగిన అటవీ క్షేత్ర అధికారి గంటల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు రాయపట్నంలో మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన ఇనోవా వాహనాన్ని స్వాధీనం చేసుకుని జప్తు చేశారు.
ఈ వాహనంలో సుమారు 71,770 రూపాయల విలువైన 0.866 క్యూబిక్ మీటర్ల అక్రమ టేకు దుంగలను తరలించినట్లు అధికారులు నిర్ధారించారు.ఈ కేసులో నిందితులైన మేడిశెట్టి మహేష్, బనావత్ సంజు నాయక్, కస్తూరి నరసింహులుపై OR కేసు నమోదు చేసినట్లు FRO గంటల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇందులో కస్తూరి నరసింహులును నిర్మల్ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.సమయస్ఫూర్తితో వ్యవహరించి, వాహనాన్ని జప్తు చేయడంలో ప్రతిభ కనబరిచిన అటవీ ఉప క్షేత్రాధికారి డి. ప్రకాష్, ఎఫ్‌బీఓలు అరుణ్ కుమార్, జె. సునీల్, చిక్కాల సునీల్, పవన్ లను ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.




