Nirmal: ట్రాఫిక్, ఇసుక అక్రమాలపై కలెక్టర్ భవేశ్ మిశ్రా ఉక్కుపాదం!
Nirmal: నిర్మల్ కలెక్టరేట్లో కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల సమీక్ష. పార్కింగ్ లేని షాపులకు నోటీసులు, అక్రమ ఇసుక వేలంపై చర్యలకు ఆదేశం.
Nirmal: ట్రాఫిక్, ఇసుక అక్రమాలపై కలెక్టర్ భవేశ్ మిశ్రా ఉక్కుపాదం!
నిర్మల్: పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. వ్యాపార సముదాయాలకు తప్పనిసరిగా పార్కింగ్ సదుపాయం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.
శనివారం కలెక్టరేట్లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్లపై ఆక్రమణలు, పశువుల సంచారం, ఇసుక అక్రమ రవాణా తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
పార్కింగ్ సదుపాయం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వ్యాపార సముదాయాలను గుర్తించి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన రహదారులపై పశువులను వదిలే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పశువుల కారణంగా ప్రమాదాలు, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే యజమానులకు జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే పశువులను స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారులు, మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న ఆక్రమణలను గుర్తించి తొలగించాలని అధికారులను ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ‘బ్లాక్ స్పాట్లు’గా గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన హెచ్చరిక బోర్డులు, ఇతర భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.
జాతీయ రహదారుల వెంట నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా భారీ వాహనాలను నిలిపే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల నిర్మాణ పనులకు కూడా నిబంధనలకు అనుగుణంగానే ఇసుకను వినియోగించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు (వీడీసీ) ఇసుక వేలం నిర్వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వీడీసీలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం : ఎస్పీ
జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వివిధ కేసుల్లో బాధితులకు అందాల్సిన నష్టపరిహారాన్ని త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో గంజాయి సాగు, విక్రయాలను అరికడుతున్నామని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అనంతరం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రత్యేక పోస్టర్ను అధికారులు ఆవిష్కరించారు.
అనంతరం రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘భూభారతి’, ‘సీఎం ప్రజావాణి’లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, ఏఎస్పీలు సాయి కిరణ్, ఉపేంద్రా రెడ్డి, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.




