Mancherial: బెల్లంపల్లి ప్రధాన రహదారిపై విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి యత్నం!

Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రధాన రహదారిపై విద్యుత్ సరఫరా కొనసాగుతుండగానే ట్రాన్స్‌ఫార్మర్‌ను కిందకు తోసి రాగిని దొంగిలించేందుకు దుండగులు ప్రయత్నించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 29 Nov 2026 10:23 AM IST
Mancherial
X

Mancherial: బెల్లంపల్లి ప్రధాన రహదారిపై విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి యత్నం!

Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాలాజీ థియేటర్‌ ఎదుట ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను దొంగిలించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించడం కలకలం రేపింది. ప్లాట్‌ఫామ్‌పై అదనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను కిందకు తోసి, బోల్టులు తొలగించి అందులోని రాగిని అపహరించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

బాలాజీ థియేటర్‌ ఎదుట ఉన్న ప్లాట్‌ఫామ్‌పై రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా, విద్యుత్‌ సరఫరాలో అత్యవసర అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయంగా వినియోగించేందుకు ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ను అదనంగా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న దుండగులు అదనంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్లాట్‌ఫామ్‌పై నుంచి కిందకు నెట్టి, దానికి ఉన్న బోల్టులను తొలగించి లోపల ఉన్న రాగిని దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఈ ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్‌ సరఫరా కొనసాగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. దొంగతనానికి పాల్పడే క్రమంలో దుండగులు విద్యుత్‌ షాక్‌కు గురై ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధాన రహదారిపై ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను కిందకు పడేసి వదిలేయడంతో అటుగా వెళ్లే పాదచారులు, ఇతర వాహనదారులు ప్రమాదవశాత్తు తాకినా విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంత పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ను కిందకు దించి, దానిని విప్పి రాగి అపహరించాలంటే ఒకరిద్దరితో సాధ్యం కాదని, దీని వెనుక ఒక ముఠా ఉండే అవకాశం ఉందని స్థానికులు అనుమానిస్తున్నారు.

మరోవైపు పట్టణంలో రాత్రివేళ పోలీసుల పెట్రోలింగ్‌ కొనసాగుతున్నప్పటికీ ప్రధాన రహదారిపై ఇలాంటి ఘటనకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి యత్నించిన వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షితంగా ఏర్పాటు చేయడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.