Mancherial: మంచిర్యాలలో పర్యాటకానికి అపార అవకాశాలు: కలెక్టర్

Mancherial: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఎకో, ఆలయ, సాహస పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 26 Sept 2026 8:34 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో పర్యాటకానికి అపార అవకాశాలు: కలెక్టర్

మంచిర్యాల: ప్రకృతి వనరులు, పర్యావరణ సమతుల్యతతో పాటు చారిత్రక, ఆధ్యాత్మిక, సాహస పర్యాటకానికి మంచిర్యాల జిల్లాలో అపార అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా టూరిజం నోడల్ అధికారి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ రూపొందించిన మంచిర్యాల టూరిజం డిపార్ట్‌మెంట్ లోగోతో పాటు టూరిజం మ్యాగజైన్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల సామర్థ్యంతో పోలిస్తే ప్రస్తుతం పర్యాటకుల రాక తక్కువగా ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను విస్తృతంగా ప్రచారం చేసి పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంతో పాటు అడ్వెంచర్ టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాక్ క్లైంబింగ్ వంటి సాహస కార్యక్రమాలకు అనువైన ప్రాంతాలను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. శివ్వారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు.తాడోబా వైపు వెళ్లే పర్యాటకులకు మంచిర్యాల జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను పరిచయం చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లాలోని పర్యాటక ప్రదేశాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యార్థులను వివిధ పర్యాటక ప్రాంతాలకు ఎక్స్కర్షన్‌లకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పర్యాటకంపై క్విజ్‌లు, పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంచవచ్చన్నారు.

పర్యాటక సర్క్యూట్‌ల అభివృద్ధికి ప్రాధాన్యం

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య మాట్లాడుతూ గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

గాంధారి ఖిల్లా, సింగరేణి సంస్థ ద్వారా వెలికితీస్తున్న నల్ల బంగారం వంటి జిల్లాలోని చారిత్రక, పారిశ్రామిక విశేషాలను పర్యాటక రంగం ద్వారా ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ టూరిజం సర్క్యూట్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు.జ్ఞాన భారతం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పురాతన మాన్యుస్క్రిప్టులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, వాటిని సంరక్షించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జిల్లా చారిత్రక వారసత్వాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్, జిల్లా పర్యాటక నోడల్ అధికారి విలాయత్ అలీ, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, పెయింటింగ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.