Mancherial: వైద్యం అందలేదని తల్లిని వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లిన కుమారుడు!

Mancherial: మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందలేదని ఆరోపిస్తూ.. కిడ్నీ బాధితురాలైన తల్లిని కుమారుడు వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే నివాసానికి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 30 Sept 2026 8:15 AM IST
Mancherial
X

Mancherial: వైద్యం అందలేదని తల్లిని వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లిన కుమారుడు!

Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందడం లేదంటూ ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తల్లిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి ఆమె కుమారుడు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి తీసుకెళ్లిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

పులిమడుగు గ్రామానికి చెందిన భూక్యా బుజ్జి (55) కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. మంగళవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుమారుడు భూక్యా రాజ్‌కుమార్ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదని, తల్లి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా చికిత్స అందించలేదని రాజ్‌కుమార్ ఆరోపించాడు. బెడ్ ఇవ్వాలని కోరినా స్పందించలేదని, ఆసుపత్రి సిబ్బంది తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

దీంతో చేసేదేమీ లేక తల్లిని అదే వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి ఆసుపత్రి నుంచి కిలోమీటర్‌కు పైగా దూరంలో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి రాత్రివేళ వెళ్లాడు.

అయితే వారు ఎమ్మెల్యే నివాసానికి చేరుకునే సమయానికి ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో.. అక్కడ ఉన్న సిబ్బంది బాధిత కుటుంబంతో మాట్లాడారు. జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని వారికి తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ శ్రీధర్ ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని బాధిత కుటుంబంతో మాట్లాడారు. తగిన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి తల్లీకొడుకులను తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సమయంలో వైద్యం అందలేదంటూ బాధిత కుటుంబం చేసిన ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.