Kumuram Bheem: అడవుల్లో ప్లాస్టిక్ పడేస్తే కఠిన చర్యలు - అటవీ శాఖ హెచ్చరిక

Kumuram Bheem: కొమురం భీం జిల్లా పెంచికల్పేట్ రేంజ్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత. అడవులను ప్లాస్టిక్ రహితంగా ఉంచాలని అధికారుల పిలుపు.

SRINIVAS, KOUTALA
Published on: 7 Oct 2026 8:54 PM IST
Kumuram Bheem
X

Kumuram Bheem: అడవుల్లో ప్లాస్టిక్ పడేస్తే కఠిన చర్యలు - అటవీ శాఖ హెచ్చరిక

Kumuram Bheem: జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు 6వ రోజు అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత. జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

అగర్‌గూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గల కల్లు బాబా గుడి పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను చెత్తాచెదారాన్ని అధికారులు, సిబ్బంది కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగం వల్ల కేవలం మనుషులకే కాకుండా మనుషులు అటవీ ప్రాంతాల్లో చేసే నిర్లక్ష్యపు పనుల వల్ల మూగ జంతువుల ఆవాసాలు కూడా తీవ్రంగా కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దైవ దర్శనాలు విహారయాత్రల కోసం అడవుల్లోకి వచ్చే ప్రజలు తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ కవర్లు సీసాలను అక్కడే పడేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వీటిని తినడం వల్ల వన్యప్రాణులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నాయని స్పష్టం చేశారు.

అటవీ ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచాలని నిబంధనలు ఉల్లంఘించి అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పడవేసి పర్యావరణానికి హాని కలిగించినట్లయితే అటవీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అటువంటి వారిపై భారీ జరిమానా విధించడమే కాకుండా అవసరమైతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అడవులు వన్యప్రాణుల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, అటవీ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలందరూ సహకరించాలని అటవీ శాఖ ఈ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో రేంజ్ సిబ్బంది DRO అస్మా, FSO లు అహ్మద్ అలీ, గోవిందు, బీట్ ఆఫీసర్స్ సంగదీప్,కళ్యాణ్, లచ్చన్న స్వర్ణలత,శిరీష, అనిమల్ ట్రాకర్స్ పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA