Gudihatnoor: గుడిహత్నూర్‌లో ఘనంగా కొమరం భీమ్ 86వ వర్ధంతి వేడుకలు!
Gudihatnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో కొమరం భీమ్ 86వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంకపూర్ నుంచి నిర్వహించిన ర్యాలీ, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Gudihatnoor: గుడిహత్నూర్‌లో ఘనంగా కొమరం భీమ్ 86వ వర్ధంతి వేడుకలు!
Gudihatnoor: ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక, ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో నిజాం నిరంకుశ పాలనపై గర్జించిన విప్లవ వీరుడు కొమరం భీమ్ 86వ వర్ధంతి వేడుకలు గుడిహత్నూర్ మండల కేంద్రంలో అత్యంత ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలోని కొమరం భీమ్ విగ్రహానికి పలువురు నాయకులు, స్థానిక ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మండలంలోని మంకపూర్ గ్రామం నుంచి ఆదివాసీలు సంప్రదాయ డోలు వాయిద్యాలు మోగిస్తూ భారీ ర్యాలీగా మండల కేంద్రానికి తరలివచ్చారు. ర్యాలీ ఆద్యంతం ఆదివాసీ మహిళలు చేసిన సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి చూపరులను ఎంతగానో అలరించాయి. అనంతరం భీమ్ విగ్రహం వద్ద గిరిజన ఆచారాల ప్రకారం సంప్రదాయ పూజలు నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. ఆదివాసీ హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన కొమరం భీమ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని, ఆయన చూపిన బాటలోనే నేటి తరం నడవాలని వక్తలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవా దౌలత్ రావు మోకాశీ, ఆదివాసీ సేన నాయకుడు ఉయిక లక్ష్మణ్, ఆదివాసీ నాయకుడు జాలిమ్ లతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరుడు కొమరం భీమ్ ఆశయాలను స్మరించుకున్నారు.




