Khanapur: అనారోగ్యం, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Khanapur: ఖానాపూర్ మండలంలో అనారోగ్యం, వైద్య ఖర్చుల అప్పుల బాధతో రైతు చిన్నయ్య ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RAKESH N, KHANAPUR
Published on: 30 Sept 2026 11:30 PM IST
Khanapur
X

Khanapur: అనారోగ్యం, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మండలంలోని మాస్కాపూర్ గ్రామానికి చెందిన వడ్లూరి చిన్నయ్య అనే 58 ఏళ్ల రైతు అనారోగ్యం, అప్పుల బాధతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాస్కాపూర్ గ్రామానికి చెందిన వడ్లూరి చిన్నయ్య గత ఆరు నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధి, బీపీ, మధుమేహం (డయాబెటిస్)తో బాధపడుతున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఒకవైపు పెరుగుతున్న అనారోగ్య సమస్యలు, మరోవైపు వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో చిన్నయ్య తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చిన్నయ్య గ్రామ పాఠశాల వెనుక ఉన్న తన పత్తి చేనుకు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలైనా ఆయన మందులు వేసుకోవడానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో, అనుమానం వచ్చిన ఆయన పెద్ద కుమారుడు వడ్లూరి శివరాజ్ చేనుకు వెళ్లి చూశారు. అక్కడ ఒక జామ చెట్టుకు నైలాన్ తాడుతో చిన్నయ్య ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు.

కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి ఆయనను కిందికి దించినప్పటికీ, అప్పటికే చిన్నయ్య మృతి చెందారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల వల్లే తన భర్త తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR