Gudihatnoor: భూమి తనఖా పెట్టినా లోన్ ఇవ్వరా? గుడిహత్నూర్ రైతు కన్నీటి ఆవేదన!
Gudihatnoor: గుడిహత్నూర్ సహకార బ్యాంకులో భూమి తనఖా పెట్టి నెలలైనా రూ.4 లక్షల రుణం ఇవ్వడం లేదని రైతు నిమిషకవి చంద్రశేఖర్ ఆవేదన. కలెక్టర్ న్యాయం చేయాలని విజ్ఞప్తి.
Gudihatnoor: భూమి తనఖా పెట్టినా లోన్ ఇవ్వరా? గుడిహత్నూర్ రైతు కన్నీటి ఆవేదన!
గుడిహత్నూర్: వ్యవసాయ అభివృద్ధి కోసం రుణం మంజూరు చేయాలని కోరుతూ భూమిని రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా సహకార సంఘం పేరిట తనఖా పెట్టి నెలలు గడుస్తున్నా బ్యాంకు అధికారులు లోన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని గుడిహత్నూర్ మండలానికి చెందిన రైతు నిమిషకవి చంద్రశేఖర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఆధారాలు సక్రమంగా సమర్పించినప్పటికీ ఏదో ఒక సాకు చెబుతూ అధికారులు రైతులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రైతు నిమిషకవి చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత జూన్ మాసంలో గుడిహత్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ద్వారా క్రాప్ లోన్ తీసుకున్నారు. అనంతరం తన వ్యవసాయ అవసరాల నిమిత్తం రూ. 4 లక్షల దీర్ఘకాలిక వ్యవసాయ రుణం (LT లోన్) కోసం గుడిహత్నూర్ సహకార బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు నిబంధనల ప్రకారం రుణం మంజూరు చేసే ప్రక్రియలో భాగంగా, గత ఆగస్టు మాసంలోనే స్థానిక రిజిస్ట్రేషన్/రెవెన్యూ కార్యాలయంలో తన పేరిట ఉన్న 2 ఎకరాల వ్యవసాయ భూమిని గుడిహత్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పేరిట మార్ట్గేజ్ డీడ్ (తనఖా) పూర్తి చేసి బ్యాంకు అధికారులకు పత్రాలు అందజేశారు.
రైతు భూమి సహకార సంఘం పేరిట తనఖా నమోదై దాదాపు మూడు నెలలు గడుస్తున్నప్పటికీ, స్థానిక ఏడీసీసీ (ADCC) బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేయడానికి ససేమిరా అంటున్నారని బాధితుడు తెలిపారు. సరైన అన్ని ధ్రువీకరణ పత్రాలను తెచ్చి బ్యాంకు అధికారులకు అందజేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.
అన్ని రకాల చట్టబద్ధమైన పత్రాలు అందజేసినా, ఏడీసీసీ బ్యాంకు మేనేజర్ స్పందించడం లేదని రైతు మండిపడ్డారు. భూమిని ఇప్పటికే బ్యాంకు పేరిట తనఖా పెట్టడం వల్ల అటు మరోచోట రుణం పొందే అవకాశం లేక, ఇటు బ్యాంకు అధికారులు లోన్ ఇవ్వకపోవడంతో పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన సహకార బ్యాంకులే ఇలా నెలల తరబడి తిప్పుకుంటూ వేధించడం తగదని పేర్కొన్నారు.
ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత బ్యాంకు అధికారులపై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు చంద్రశేఖర్ కోరారు. అధికారులు స్పందించి తనకు రావలసిన ఈ లోన్ ఇప్పించకపోతే చావే శరణ్యమని బాధితుడు కన్నీటిపర్యంతమవుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.




