Gudihathnoor: గుడిహత్నూర్‌లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించండి
Gudihathnoor: గుడిహత్నూర్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలని కోరుతూ డిప్యూటీ తహశీల్దార్‌కు AIHRA నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆటో స్టాండ్ కేటాయించాలని విజ్ఞప్తి.
Gudihathnoor: గుడిహత్నూర్‌లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించండి
గుడిహత్నూర్: మండల కేంద్రంలో నిత్యం నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యలను నివారించి, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ (AIHRA) ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
నిర్మల్ బస్టాప్ సమీపంలో ప్రయాణికులకు తగిన వసతులు లేకపోవడంతో వారు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంఘం నాయకులు పేర్కొన్నారు. దీనికితోడు పక్కనే ఉన్న గ్రామీణ బ్యాంకు, మీసేవ కేంద్రాల ఎదుట ద్విచక్ర వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేస్తుండటంతో పాదచారులు, ఇతర వాహనదారులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని తెలిపారు.
మరోవైపు అంగడి బజారులో వారసంత జరిగే వేళల్లో రోడ్లపైనే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేస్తుండటం వల్ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నాయని, దీనివల్ల అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ప్రయాణికుల వాహనాలు చిక్కుకుపోయి తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రద్దీని నియంత్రించేందుకు ఆటోల కోసం ప్రత్యేకంగా స్టాండ్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో AIHRA జిల్లా అధ్యక్షుడు మల్యాల శ్రీకర్, జాయింట్ సెక్రటరీ టేకుల అశోక్, కార్యదర్శి బడుగుల లచ్చన్న, తెలంగాణ కో-ఆర్డినేటర్ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.




