Gudihathnoor: నర్సరీలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి: జిల్లా ఉద్యాన అధికారి హెచ్చరిక
Gudihathnoor: ప్రభుత్వ అనుమతి లేకుండా కూరగాయ నారు నర్సరీలు నడిపితే క్రిమినల్ కేసులు పెడతామని గుడిహత్నూర్‌లో జిల్లా ఉద్యాన అధికారి జి. సందీప్ కుమార్ హెచ్చరించారు.
Gudihathnoor: నర్సరీలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి: జిల్లా ఉద్యాన అధికారి హెచ్చరిక
గుడిహత్నూర్: ప్రభుత్వ అనుమతి లేకుండా అనధికారికంగా కూరగాయ నారు నర్సరీలను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జి. సందీప్ కుమార్ హెచ్చరించారు. మండలంలోని పలు కూరగాయ నర్సరీలను ఉద్యానవన శాఖ విస్తరణ అధికారి ఆడెపు శేఖర్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, నిర్వహణ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ, లైసెన్స్ లేకుండా నర్సరీలను నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పాత నర్సరీల పేరుతో పొందిన లైసెన్స్‌లను చూపిస్తూ కొత్తగా నర్సరీలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుడిహత్నూర్ మండలంలో మొత్తం 18 నర్సరీలు ఉండగా, ఇప్పటివరకు కేవలం 8 మంది మాత్రమే తమ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకున్నారని, మిగిలిన 10 మంది వెంటనే రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
కొత్తగా నర్సరీలను ఏర్పాటు చేయాలనుకునే రైతులు, నిర్వాహకులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, గ్రామ పంచాయతీ ఆమోద పత్రం, మట్టి మరియు నీటి పరీక్ష నివేదికలు, రైతు ఒప్పంద పత్రాలతో కూడిన దరఖాస్తును స్థానిక ఉద్యాన విస్తరణ అధికారికి గానీ, జిల్లా కార్యాలయంలో గానీ సమర్పించి, బ్యాంకులో నిర్ణీత రుసుము చెల్లించి లైసెన్స్ పొందాలని సూచించారు. పాత నర్సరీల యజమానులు సైతం రెన్యువల్ దరఖాస్తు, అగ్రిమెంట్ కాపీ, ఆధార్, బ్యాంకు చలానా సమర్పించి వెంటనే అనుమతులు పునరుద్ధరించుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.




